తాండూర్, ఆగస్టు 2: మంచిర్యాల జిల్లా తాండూరు మేజర్ గ్రామపంచాయతీలో విద్యుత్ స్తంభం ప్రమాదభరితంగా ఒరిగి తీగలు వేలాడుతున్నప్పటకీ విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదు. కొత్త గుడిసెలు కాలనీలోని సురభి మినీ ఫంక్షన్ హాలు సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.
ఫంక్షన్ హాలుకు వచ్చిపోయే ప్రజలతో పాటు పిల్లలు నిత్యం తిరిగే వీధిలో ఇలా ప్రమాదకరంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వారం రోజుల పాటు ముసురుపట్టిన సమయంలోనే ఈ విద్యుత్ స్తంభం కూలిపోతుందేమోనని భయపడ్డామని స్థానికులు చెప్పారు. దీనిపై గ్రామ పంచాయతీ, ఏఈ సహా విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ వారు స్పందించడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.