మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 01 : బాలకార్మిక వ్యవస్థను(Child laborers) నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి 88 మంది బాలలకు విముక్తి కల్పించామని రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీనివాస్(CP Srinivas) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తప్పిపోయిన, వదిలివేయబడిన, వివిధ రకాల బాల కార్మికులు, రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించామన్నారు. మరికొందరిని స్టేట్ హోమ్‌కు తరలించామన్నారు. వివిధ శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ విజయవంతంగా ముగిసిందనితెలిపారు.
బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని సీపీ కోరారు. ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నా, ఎక్కడైనా పనిచేసినా, తప్పిపోయినా బాలల సమాచారం తెలిస్తే చైల్డ్ హెల్ఫ్ లైన్ 1098 (చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్), డయల్ వంకి కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. బాల కార్మికులుగా పెట్టుకున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు శాఖతో కలిసి ఆపరేషన్ స్మైల్ విజయవంతం చేయడంలో కృషి చేసిన వివిధ శాఖల అధికారులను, సిబ్బందిని సీపీ అభినందించారు.