జయశంకర్ భూపాలపల్లి, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : అనుకున్నట్లుగానే పేద రైతుపై ప్రతాపం చూపేందుకు సింగరేణి అధికారులు సిద్ధమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం శివారులోని 126/1 సర్వే నంబర్లో ఎకరంన్నర భూమిలో కాల్వపల్లి కనకరాజు, రాజేశ్వరి దంపతులు 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు సింగరేణి అధికారులు పోలీస్ ఫోర్స్‌ను కోరినట్లు సమాచారం. నేడు (సోమవారం) ఏ క్షణంలోనైనా భారీ యంత్రాలతో వెళ్లి మామిడి, కూరగాయల తోటలు, గుడిసెలు, పశువుల కొట్టాలను కూల్చివేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
పోలీసుల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే స్థలంలో ఉన్న వృక్షాలు, గుడిసెలు నేలమట్టం చేసేందుకు సింగరేణి అధికారులు ముందుకు సాగుతున్నారు. కోట్లాది రూపాయల భూములు అన్యాక్రాంతం అవుతున్నా.. సింగరేణి సంస్థ భూముల్లో పరిహారం తీసుకొని సాగు చేసుకుంటున్నా.. పట్టని సింగరేణి అధికారులు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేస్తున్నారు. కనీసం వృద్ధ దంపతుల దయానీయ పరిస్థితిని చూడలేని సర్కారు తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. తమ భూములు లాక్కుంటే ‘మా జాగలోనే ప్రాణాలు వదిలేస్తామని’ సదరు దంపతులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై వృద్ధ దంపతులు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబుచ్చుకుంటూ, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
అసైన్డ్ రిజిస్టర్ ఏమైనట్లు?
126/1 సర్వే నంబర్లో చాలా మంది గిరిజనులు, గిరిజనేతరులు సుమారు 40 ఏళ్లుగా కాస్తులో ఉన్నారు. వారికి నాడు రెవెన్యూ అధికారులు అసైన్డ్ పట్టా చేశారు. అయితే అప్పుడు కొందరు రెవెన్యూ అధికారులు, దళారులు ఇష్టారాజ్యంగా రైతుల పరిహారాన్ని ఫలహారంగా మార్చుకొని ఒకరి భూమిని మరొకరిపై రాసుకుంటూ అందినకాడికి దోచుకున్నారు. ఆ క్రమంలో అసైన్మెంట్ రిజిస్టర్నే మాయం చేశారు. అదే సమయంలో కనకరాజు తన సమస్యను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మిగిలిన తన భూమిని అసైన్డ్ చేసి పరిహారం ఇవ్వాలని వేడుకున్నాడు.
2000 సంవత్సరం నుంచి 2005 అసైన్మెంట్ రిజిస్టర్ కనిపించడం లేదని అప్పటి తహసీల్దార్ సత్యనారాయణస్వామి కలెక్టర్‌కు లేఖ రాశారు. దీంతో అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయిన కనకరాజు చివరికి కోర్టు మెట్లెక్కారు. కోర్టు నుంచి కనకరాజుకు అనుకూల తీర్పు (ఎఫ్/1290/2014) వచ్చింది. అప్పటి ములుగు ఆర్డీవో మహేందర్‌జీ పట్టాలు ఇచ్చేలోపే బదిలీ కావడం కనకరాజుకు శాపంగా మారింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇక ఆనాటి నుంచి తాను కాస్తుకున్న రెండు ఎకరాల స్థలం పట్టాకు నోచుకోలేదు. అనంతరం అప్పుడు ఆర్డీవో అధికారి కార్యాలయంలో ఉన్న ఓ అధికారి అమ్యామ్యాలు తీసుకొని చాలా మందికి పట్టాలు చేశారు. కనకరాజు ముడుపులు ఇవ్వకపోవడంతో పక్కన పెట్టారు. దీంతో నేడు కనకరాజు ఈ దుస్థితిలో అందరి కాళ్లావేళ్లా పడే పరిస్థితి వచ్చింది. అధికారుల తప్పిదం వృద్ధ దంపతుల ప్రాణం మీదికి వచ్చింది.