కడెం వాగు వంతెనను ఢీకొని లోయలోపడ్డ కారు
ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రమాదం
డ్రైవర్ నిద్రమత్తే కారణం
కూతురు అక్కడికక్కడే.. తండ్రి దవాఖానకు తరలిస్తుండగా మృతి
తోడుపెండ్లి కూతురు, డ్రైవర్‌కు తీవ్రగాయాలు
వరుడు, వధువు తల్లికి స్వల్పగాయాలు
శోకసంద్రంలో పాత మద్దిపడగ
మెట్టినింట రిసెప్షన్ ముగించుకొని వస్తూ వధువు, తండ్రి మృత్యుఒడికి..
కడెం, ఆగస్టు 28: జీవితంపై ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలో అడుగుపెట్టిన ఓ నవ వధువు కాళ్ల పారణి ఆరకముందే మృత్యుఒడికి జారుకుంది. మెట్టినింట్లో ఆనందంగా రిసెప్షన్‌ను పూర్తిచేసుకొని పుట్టినింటికి వస్తుండగా, రోడ్డు ప్రమాదం మృత్యురూపంలో తండ్రితోపాటు ఆమెనూ కబళించింది. మహారాష్ట్ర నుంచి బయల్దేరి పది నిమిషాల్లో ఇల్లు చేరుతామనగా, దురదృష్టం డ్రైవర్ నిద్రరూపంలో వాహనాన్ని లోయలోకి జార్చింది. రెండురోజుల క్రితమే శుభకార్యంతో సంతోషంగా గడిపిన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చగా, తండ్రీ కూతురు రాజన్న, మౌనిక మృతితో నిర్మల్ జిల్లా కడెం మండలం పాతమద్దిపడగ శోకసంద్రంలో మునిగింది.
జీవితంపై ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలో అడుగుపెట్టిన ఓ నవ వధువు కాళ్ల పారాణి ఆరకముందే మృత్యుఒడిలోకి జారుకుంది. మెట్టినింట్లో ఆనందంగా రిసెప్షన్‌ను పూర్తిచేసుకొని, పుట్టినింటికి వస్తుండగా రోడ్డు ప్రమాదం మృత్యురూపంలో తండ్రితో పాటు ఆమెను కబళించింది. నిర్మల్ జిల్లా కడెం మండలం పాతమద్దిపడగ శోకసంద్రంలో మునిగింది. మండలంలోని పాతమద్దిపడకు చెందిన కొండ రాజన్న-వసంత దంపతుల కూతురు మౌనిక (26)కు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా మండలంలోని సాస్తి టౌన్‌షిప్‌కు చెందిన జనార్దన్‌తో ఈ నెల 25 వైభవంగా వివాహం జరిపించారు. 27న మహారాష్ట్రలో రిసెప్షన్ ఉండడంతో కుటుంబ సభ్యులతో పాటు, బంధువులు వాహనాల ద్వారా మహారాష్ట్రకు చేరుకున్నారు. అక్కడ శుభకార్యం ముగించుకొని రాత్రి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో కడెం మండలం పాండ్వాపూర్ చెక్‌పోస్ట్ దాటిన అనంతరం కడెం వాగు వద్ద ఎర్టిగా వాహనం అదుపుతప్పి వంతెన గోడకు ఢీకొని లోయలోకి జారింది. అర్ధరాత్రి సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో పెళ్లి కూతురు మౌనిక తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది.
ప్రమాదం విషయం తెలుసుకున్న మౌనిక మేనమామలు మండలంలోని కన్నాపూర్ నుంచి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మౌనిక మృతిచెందగా, ముందుభాగంలో ఉన్న కొండ రాజన్న కాళ్లు కారులో ఇరుక్కొని రెండు కాల్లు విరిగాయి. అంబులెన్స్ సహాయంతో మౌనిక మృతదేహాన్ని ఖానాపూర్ దవాఖానకు తరలించగా, రాజన్నను బయటకు తీశారు. దవాఖానకు తరలిస్తున్న సమయంలో కడెం-పెద్దూర్ దాటుతున్న సమయంలో ప్రాణాలు కోల్పొయాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.డ్రైవర్‌ది ఖానాపూర్ మండలంలోని రంగపేట.. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాలు విరిగింది. చాతిలో బలమైన గాయాలు కావడంతో డ్రైవర్‌ను నిజామాబాద్ దవాఖానకు తరలించారు. వెనుక భాగంలో కూర్చున్న మౌనిక పెద్దమ్మ కూతురు మెర్సీకి కూడా బలమైన గాయాలు కావడంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించినట్లు బంధువులు తెలిపారు. మౌనిక, రాజన్న మృతదేహాలకు ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానలో పంచనామా నిర్వహించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మద్దిపడగలో విషాదం
ఈ నెల 25న వివాహం చేసుకున్న మౌనిక రెండు రోజుల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం, ఆమె తండ్రి సైతం ప్రమాదానికి బలికావడంతో మద్దిపడగలో విషాదం చోటుచేసుకుంది. ఖానాపూర్ నుంచి మద్దిపడగ గ్రామానికి మృతదేహాలను తీసుకొచ్చిన అనంతరం వారి ఇంటి వద్దకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మృతదేహాలను చూస్తూ కన్నీరుమున్నీరుగా విలపించారు. వివాహానికి వచ్చిన వారు ఇలా చావుకు కూడా రావడంతో ఆ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు. ప్రమాదంలో భర్త, కూతురు మరణించిన విషయం ఆలస్యంగా తెలుసుకున్న వసంత ఆ మృతదేహాల వద్ద రోదించిన తీరు స్థానికులను కంటతడిపెట్టించింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్నున్నట్లు ఎస్ఐ కోదాడి రాజు తెలిపారు.