కోటపల్లి, మార్చి 28 : 63వ జాతీయ రహదారిపై ఇష్టారాజ్యంగా వాహనాలు పార్కింగ్ చేస్తే చర్యలు తప్పవని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. కోటపల్లి మండలం బోరంపల్లి, కొల్లూరు ఇసుక క్వారీలకు వచ్చే లారీలు జాతీయ రహదారిపై పార్కింగ్ చేయడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న కలెక్టర్.. డీసీపీ భాస్కర్‌తో కలిసి ఇసుక రీచ్‌లను శుక్రవారం సందర్శించారు. కాంట్రాక్టర్లతో మాట్లాడారు.
ఇసుక నింపడంలో జాప్యం కారణంగా జాతీయ రహదారిపై లారీలు పార్కింగ్ చేస్తున్నారని, త్వరగా లోడ్ చేస్తే సమస్య పరిష్కారమవుతుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం కోటపల్లి తహసీల్ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రజావాణి ఫిర్యాదుల ప్రగతిని తహసీల్దార్ రాఘవేంద్రరావ్ను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల ప్రహరీల నిర్మాణ ప్రగతిని ఎంపీడీవో లక్ష్మయ్యను అడిగారు. కోటపల్లి పీహెచ్‌సీని సందర్శించి, కలెక్టర్ రోగులకు న్యాయమైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారిణి అరుణశ్రీకి సూచించారు. చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.