మంచిర్యాల అర్బన్, జనవరి 30 : రోడ్డు భద్ర తా నిబంధనలు పాటించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. జాతీయ రోడ్డు మాసోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా గురువారం పాతమంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన, నేత్ర పరీక్షల శిబిరానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణిస్తున్నవారంతా తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. ప్రమాదాల బారిన పడిన వారిలో ఎక్కువ శాతం మద్యం సేవించిన వారే ఉంటున్నారన్నారు.
గతేడాది 10047 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే చర్యలు తీసుకోనున్నట్లు, లైసెన్స్‌ను రద్దు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి తులసీరాం సంతోష్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డా.హరీశ్ చంద్రారెడ్డి, ఆర్ఎంవోలు డా.భీఫ్మా, శ్రీధర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ చందూరి మహేందర్, ఎంవీఐ రంజిత్ రెడ్డి, ఏఎంవీఐలు కాశీం సాహెద్, సూర్యతేజ, పట్టణ సీఐ ప్రమోద్ రావు, ట్రాఫీక్ సీఐ సత్యనారయణ, ఎస్ఐలు, సిబ్బంది, వాహన యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు.