మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 18: బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈ నెల 19న మంచిర్యాల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలంతా తమకు సహకరించాలని కోరారు. క్యాతన్‌పల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే, దళిత నాయకుడు బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్కు పూర్తి మెజార్టీ వచ్చినా కూడా కాంగ్రెస్ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్న తీరు యావత్ తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందన్నారు. ఒక్క క్యాతన్పల్లిలోనే కాకుండా తొర్రూర్, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్, ఇలా హంగ్ వచ్చిన ప్రతి చోట ప్రజాతీర్పును గౌరవించకుండా చైర్మన్ పీఠాలను బెదిరింపులకు గురిచేస్తూ, కిడ్నాపులకు తెగబడుతూ అడ్డదారుల్లో దక్కించుకుంటున్నారని విమర్శించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని, కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలు పతనమై పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక వాతావరణంలో క్యాతన్‌పల్లి చైర్మన్ ఎన్నిక జరిగేలా బాధ్యత వహించాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు.
చెన్నూర్/చెన్నూర్ రూరల్/ మందమర్రి, ఫిబ్రవరి 18: బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా గురువారం చెన్నూర్ బం ద్‌కు బీఆర్ఎస్ శ్రేణులు పిలుపు నిచ్చారు. చెన్నూర్ పట్టణంలోని వర్తక, వాణిజ్య సంస్థలు, హోటళ్లు, ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థలు, బ్యాంకులు, కిరాణా దుకాణాలతో పాటు చిరు వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లెల దామోదర్‌రెడ్డి కోరారు. బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ బంద్‌లో పాల్గొనాలని కోరారు. మందమర్రి ప ట్టణంలో చేపట్టే బంద్‌లో వర్తక వాణిజ్య వ్యాపారులు, విద్యా సంస్థలు, ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా పాల్గొని విజయ వంతం చేయాలని బీఆర్ఎస్ మందమర్రి పట్టణ అధ్యక్షుడు జే.రవీందర్, ఇన్చార్జి బత్తుల శ్రీనివాస్ కోరారు.