తిర్యాణి/ఫర్టిలైజర్సిటీ, ఆగస్టు 6: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని రమేశ్ కాలనీకి చెందిన సింగరేణి ఆర్జీ-1 కార్మికుడు సంగే రవి కుమారుడు రిషి ఆదిత్య (18) ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని గుండాల జలపాతంలో సోమవారం గల్లంతైన విషయం తెలిసిందే. సోమవారం నుంచి మంగళవారం రాత్రి వరకు తిర్యాణి పోలీసుల ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లతో గుండాల గ్రామస్తుల సహాయంతో జలపాతంలో ముమ్మరంగా గాలించినా యువకుడి ఆచూకీ లభ్యం కాలేదు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రిషి ఆదిత్య తన ఐదుగురు స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాలపై గుండాలలోని జలపాతం చూసేందుకు వెళ్లాడు. జలపాతం వద్ద సెల్ఫీ దిగుతుండగా అందులో జారి పడిపోయాడు. ఈ విషయం తెలుసుకొని రిషి ఆదిత్య కుటుంబ సభ్యులు సాయంత్రం ఘటన స్థలానికి వెళ్లగా చీకటి కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టలేదు.
మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు గజ ఈతగాళ్లతో గాలించినా ఆచూకీ దొరకలేదు. నీటి లోతులో రిషి ఆదిత్య చిక్కుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి కావడంతో తాత్కాలికంగా గాలింపు చర్యలు నిలిపివేసినట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. తిరిగి బుధవారం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని తెలిపారు.