తాండూర్ : ఆటో రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. తాండూర్ లో సోమవారం నుంచి చేపట్టనున్న ఆటోల బంద్ ( Auto Strike) పోస్టర్ను సీఐటీయూ ( CITU ) యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగం రాజారాం, ఆటో యూనియన్ తాండూరు మండల ఉపాధ్యక్షుడు చాంద్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు చేపట్టే నిరవధిక బందును జయప్రదం చేయాలని జేఏసీ పిలుపునిచ్చిందన్నారు.
ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ప్రతి ఏటా రూ.12,000 ఆర్ధిక సహాయం, డ్రైవర్ల రక్షణకు సంక్షేమ బోర్డు, రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని కోరారు. ఆర్టీసీ యాజమాన్యానికి ఈవీ ఆటోలను ఇవ్వాలనే ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, ఆటో సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.