బోథ్, డిసెంబర్ 10 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు వీలుగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకాన్ని మహిళలు వినియోగించుకోవాలన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవసరమైన చికిత్స చేసుకోవచ్చని తెలిపారు.
వెనుకబడిన బోథ్ నియోజకవర్గాన్ని పార్టీలకతీతంగా అందరి సహకారంతో అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను త్వరితగతిన నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, ఆదిలాబాద్ డీఎం కల్పన, ఎంఎఫ్ శ్రీకర్, బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్ సురేందర్ యాదవ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, దవాఖాన సూపరింటెండెంట్ ఆర్ రవీంద్రప్రసాద్, ఏఎంసీ చైర్మన్ రుక్మాణ్‌సింగ్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, డిసెంబర్ 10 : కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రయాణ ప్రాంగణంలో మహాలక్ష్మి, ఆరోగ్య శ్రీ పథకాలను ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ హేమంత్ బోర్కడే సహదేవరావు ప్రారంభించారు. పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు సముచిత స్థానం, గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం శ్రీధర్, ఆర్టీసీ సిబ్బంది, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.