కాగజ్‌నగర్, అక్టోబర్ 19 : ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. కాగజ్‌నగర్ మండలంలోని ఎన్జీవోస్ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను శనివారం సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్-2020 పథకంలో అనుమతి లేని లే-అవుట్ల క్రమబద్ధీకరణకు అందిన దరఖాస్తులను రికార్డులు సరిచూసి సదరు ప్లాట్ల భౌగోళిక స్థితిని పరిశీలించి, ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. నిషేధిత, ప్రభుత్వ భూములు, చెరువు శిఖం, వాగుల సంబంధిత భూముల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు, సిబ్బంది క్షేతస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు దరఖాస్తుదారుడికి సమాచారం అందించి, సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించాలని సూచించారు. సర్వే ప్రక్రియను నిర్ణీత గడువు లోగా పూర్తి చేసి తదుపరి కార్యాచరణకు రికార్డు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి, తహసీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, టీం సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఇరిగేషన్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలన..
కాగజ్‌నగర్ మండలంలోని చారిగాం రోడ్డులోని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని, నిర్మాణ దశలో ఉన్న భవనాన్ని సబ్ కలెక్టర్‌తో కలిసి అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, మున్సిపల్ ఇంజినీర్ రమాదేవి, ఇరిగేషన్ డీఈ, ఈఈలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.