మంచిర్యాల, జూలై 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ ప్రకృతి ప్రకోపాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుపై నెట్టి.. దాని వల్లే పంటలు మునిగాయని అసత్య ప్రచారానికి తెరలేపింది. తెలంగాణ వరప్రదాయినిగా కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తింపు పొందడాన్ని జీర్ణించకోలేక ఈ ప్రాజెక్టు వల్లే గోదావరి, ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లోని వేలాది ఎకరాల్లో పంటలు నీట మునుగుతాయని అసత్య ప్రచారం చేసి గత ఎన్నికల్లో లబ్ధిపొందింది. ప్రస్తుతం తాజా పరిస్థితులను చూస్తే ఇటు అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు నీరు లేక గోదావరి వెలవెలపోతున్నది.
ప్రాణహిత ప్రవాహానికి కోటపల్లి మండలంలోని దేవులవాడ, అన్నారం, పుల్లగామ, సిర్సా, ఆలుగామ, జనగామ, వెంచపల్లితోపాటు వేమనపల్లి మండలాల్లోని పొలాలు నీట మునిగాయి. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో కాంగ్రెస్ ప్రభుత్వం నీరు ఆపకున్నా ప్రాణహిత నది ప్రవాహం వల్ల ఇంత నష్టం జరిగింది. దీనిని బట్టి చూస్తే గతంలో వచ్చిన వరదల నష్టానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదన్నది తేటతెల్లమవుతున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరగని సమయంలోనూ గతంలో ప్రాణహిత, గోదావరి నదులు ఉప్పొంగి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిన సందర్భాలున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పటి నుంచి భారీగా వర్షాలు కురియడం, వీటికి తోడు ప్రాణహిత నదికి పెద్ద ఎత్తన వరద రావడంతో ఆయా ప్రాంతాల్లో పంటలు నీట మునగగా, ఇదే అదనుగా భావించిన కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై విష ప్రచారానికి తెరలేపింది. నదుల సహజ ప్రవాహానికి జరిగిన ఈ నష్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టి తప్పించుకుంది. నదిపైన ప్రాజెక్టు నిర్మాణం జరగకముందు ఇంతకన్నా పెద్ద మొత్తంలో వరదల వల్ల పంట నష్టం జరిగినా.. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టు అనంతరం వచ్చిన వరద నష్టాన్ని పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం మోపి ఆనందపడింది.
తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వం విషప్రచారం చిమ్మి సక్సెస్ అయింది. కేవలం ప్రాజెక్టు నిర్మాణం వల్లే ఈ ప్రాంతంలో పంట నష్టం జరుగుతోందనే అబద్ధాన్ని ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. రైతులు కూడా ఈ విషయాన్ని గ్రహించగా కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించగా, ప్రస్తుతం వర్షాలు లేని సమయంలో నదీ ప్రవాహం వల్ల జరిగిన నష్టాన్ని చూసి తలలు పట్టుకుంటున్నారు. ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చితే ఫలితం ఎలా ఉంటుందో ఈ ప్రాంత రైతులకు తెలిసినప్పటికీ కాళేశ్వరంపై విషాన్ని కాంగ్రెస్ పార్టీ చిమ్మి ఈ ప్రాంత రైతులను మోసం చేసిందని పలువురు పేర్కొంటున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలను ఆనుకుని ప్రవహిస్తున్న ప్రాణహిత నదీ ప్రవాహం ఆయా ప్రాంతాల్లోని పత్తి పంటలు నీటమునిగిపోతాయి. ఈ నది అవతలి వైపు గడ్చిరోలి జిల్లాకు ఆనుకుని సుమారుగా 113 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తుండగా, మహారాష్ట్రలోని దట్టమైన అడవుల వల్ల వర్షాలు కురిస్తే నదీ ఉగ్రరూపం దాలుస్తుంది. తెలంగాణలో వర్షాలు లేకున్నా మహారాష్ట్ర వర్షాల వల్ల ఈ నదీ ఉగ్రరూపం దాల్చి రెండు జిల్లాల్లో పంట నష్టాన్ని చేకూర్చుతుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పంట నష్టం జరిగిందని గతంలో బీజేపీ తరపున ప్రస్తుత మంత్రి వివేక్ పర్యటించారు. ఆ సమయంలో ఎకరానికి రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున నష్టపోయిన రైతులకు రూ.లక్ష నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు ఆపకున్నా పంటలు నీట మునిగాయి. వరదలకు, ప్రాజెక్టుకు ఎలాంటి సంబంధం లేదని ఈ వరదలతో తెలిసి పోయింది.
– కామ శ్రీనివాస్, అన్నారం, కోటపల్లి.
గతంలో పంట నష్టం జరిగితే కాళేళ్వరం ప్రాజెక్టు వల్లేనని కాంగ్రెస్ విష ప్రచారం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు లేని సమయంలోను మా ప్రాంతంలో వరదలకు అనేకసార్లు పంటలు నష్టపోయిన సందర్భాలున్నాయి. ప్రాణహిత నది ప్రవహానికి గోదావరి నది ప్రవాహం తోడయితే నష్టం మరింత ఉండేది. ప్రస్తుతం ప్రాజెక్టు ఓపెన్ ఉన్న ఒక్క ప్రాణహిత నదీ ప్రవాహం వల్ల జిల్లాలో జరిగిన నష్టాన్ని సర్వే చేయించి పరిహారం అందజేయాలి. కాంగ్రెస్సే బాధ్యత వహించాలి.
– మారిశెట్టి మల్లయ్య, రాంపూర్,కోటపల్లి.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పంట నష్టం జరిగిందని గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసింది. నది పైన ప్రాజెక్టు నిర్మించన ప్పుడు కూడా ఇంతకన్నా పెద్ద మొత్తంలో వరదలు వచ్చిన సందర్భాలున్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా ప్రాజెక్టు నిర్మించ నప్పటి నుంచే వరదలు వస్తున్నాయని అసత్య ప్రచారం చేసి ఈ ప్రాంత రైతులను కాంగ్రెస్ మోసం చేసింది. ప్రాజెక్టు వల్ల గతంలో నష్టం జరిగి ఉంటే ప్రస్తుతం ప్రాజెక్టు ఓపెన్ ఉన్నా ప్రాణహిత నదీ ప్రవాహం వల్ల నష్టం ఎందుకు జరిగింతో చెప్పాలి.
– కొడిశెట్టి రాజు, సూపాక, కోటపల్లి.