కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనపై వైద్యులు, నర్సులు, సిబ్బంది కన్నెర్ర చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు శనివారం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సేవలు నిలిపివేసి నిరసనలు చేపట్టారు. ప్రధాన వీధులగుండా ర్యాలీలు తీశారు. మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. సాయంత్రం కొవ్వొత్తులను ప్రదర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
– నమస్తే బృందం
ఇవి కూడా చదవండి
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
కోటపల్లి, ఆగస్టు 17 : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. కోటపల్లి మోడల్ స్కూల్లో డ్రగ్స్ నిర్మూలనపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డీసీపీ మాట్లాడారు. కొంతమంది మత్తు పదార్థాలకు బానిసై వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, చిన్నతనం నుంచే యువత పెడదారి పడుతుండడంతో అనేక అనర్థాలు జరుగుతున్నాయన్నారు.
పల్లెల్లో మత్తు పదార్థాలు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్, కోటపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పిచ్చి మొక్కల తొలగింపు
బెల్లంపల్లి, ఆగస్టు 17 : బెల్లంపల్లిలోని కాళోజీ శాఖ గ్రంథాలయం ఆవరణలో అపరిశుభ్రంగా ఉండగా, ఈ నెల 15న ‘ఫొటోలకు ఫోజులిచ్చారు.. పారిశుధ్యం మరిచారు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించింది. ఇందుకు మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, కమిషనర్ శ్రీనివాసరావు స్పందించారు. వారి ఆదేశాల మేరకు పారిశుధ్య సిబ్బంది శనివారం డోజర్ సాయంతో ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించారు. మిగతా పనులను మంగళవారం కొనసాగిస్తామని జవాన్ రామస్వామి తెలిపారు. పిచ్చి మొక్కలు తొలగించడంతో పోటీ పరీక్షల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రంథాలయాధికారి ఉప్పుగోపికి అభ్యర్థులు కృతజ్ఙతలు తెలిపారు.