కుభీర్ : నిత్య పూజలు అందుకుంటున్న గణనాథుడిని పలు గ్రామాల ప్రజలు ఆదివారం ఘనంగా నిమజ్జనం చేశారు. నిర్మల్ జిల్లా కుభీర్ (Kubeer ) మండలం పార్డి (కె), జాంగాం, కస్ర, వర్ని, హంపొలి, గోడాపూర్, లింగి, వాయి, పాంగ్ర, బాకోట్, అంతర్ని, రంజిని, మోల, మార్లగొండ గ్రామాలలో ప్రతిష్టించిన 37 వినాయక విగ్రహాలకు ఉదయం నుంచే మండపాలలో ప్రత్యేక పూజలతో హారతులు ఇచ్చారు.
ఆలయాలు, మండపాలలో వినాయక విగ్రహాల వద్ద ఐదు రోజులు పూజలు అందుకున్న లడ్డూలతో పాటు పెన్ను, నోట్ బుక్కులు, వినాయక విగ్రహంపై కప్పిన రుమాలు వస్త్రాలకు కోలాహలంగా వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో వస్తువులను చేజిక్కించుకున్న భక్తుల ఇండ్లకు భాజభజంత్రీలతో వెళ్లి వాటిని అందజేశారు.
అనంతరం ఆలయాలతో పాటు ఆయా గ్రామాల్లోని మండపాలలో అన్నదాన కార్యక్రమాలు కొనసాగాయి. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై విగ్రహాలను ప్రతిష్టించి గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. ఆచారం ప్రకారం కొన్ని గ్రామాలలో సూర్యాస్తమయం కంటే ముందే వినాయకులను నిమజ్జనం చేయగా యువకులు ప్రతిష్టించిన గణనాథులను ఈ రాత్రి 12 గంటల లోపు నిమజ్జనం చేయనున్నట్లు తెలుస్తోంది. కుభీర్ ఎస్సై కృష్ణారెడ్డి పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు.