మంచిర్యాల, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం కిరాయి బకాయిలు చెల్లించడం లేదు. కొన్ని నెలలుగా అద్దె పెండింగ్‌లో ఉండగా, ఆయా భవనాల యజమానులు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అద్దె బకాయిలు చెల్లించని కారణంగా యాజమానులు 15వ తేదీన భవనాలకు తాళాలు వేయాలని నిర్ణయించుకున్నారు. అద్దె చెల్లించాకే గురుకుల భవనాలకు వేసిన తాళాలు తీస్తామని స్పష్టం చేశారు.
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాల ప్రైవేట్ యాజమానుల సంఘం ఆధ్వర్యంలో కొన్ని అద్దె భవనాల ముందు ప్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలోని కొన్ని మండలాల్లో గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఈ మేరకు ఇక్కడున్న భవన యజమానులు సైతం తాళాలు వేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు అద్దె భవనాల యజమానులను బతిమిలాడుకున్నారు. తాళాలు వేస్తే సర్కారు పరువు పోతుందని మొరపెట్టుకున్నారు. కాదూ.. కూడదని తాళాలు వేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ బెదిరించారు.
ఈ విషయాన్ని స్వయంగా ఓ భవన యజమానే ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇంత చేసినా మూడు స్కూళ్లకు యాజమానులు తాళాలు వేశారు. చెప్పినట్లుగానే తాండూర్ ఎంజేపీ భవనానికి తాళం వేసిన ఓనర్ సురభి శరత్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. ప్రిన్సిపాల్ సుద్దాల వినోద్, అధ్యాపకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శరత్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కిరణ్‌కుమార్ తెలిపారు.
ఎంజేపీ భవనాలకు తాళాలు
తాండూర్/మందమర్రి, అక్టోబర్ 15 : అద్దె చెల్లించడం లేదంటూ మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల భవనాల యజమానులు తాళాలు వేయగా, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆరుబయటే వేచి ఉండాల్సి వచ్చింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల హాస్టల్ అద్దె భవనంలో కొనసాగుతున్నది. కొద్ది నెలలుగా ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో యజమాని సురభి శరత్‌కుమార్ మంగళవారం భవనానికి తాళం వేశాడు.
11 నెలలుగా రూ. 9.90 లక్షలు అద్దె రావాల్సి ఉందని, ఈ విషయమై అధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించలేదని శరత్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గురుకుల విద్యాలయ ప్రైవేట్ భవన యాజమాన్య సంఘం పిలుపు మేరకు హాస్టల్ గేటుకి తాళం వేసినట్లు తెలిపాడు. అద్దె చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై హాస్టల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయలు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
తాండూర్ ఎంపీడీవో శ్రీనివాస్, కొంత మంది అధికారులు హాస్టల్ వద్దకు చేరుకొని ఇంటి యజమాని, ప్రిన్సిపాల్‌తో మాట్లాడారు. డీసీవో, ఆర్సీవో, కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని ప్రిన్సిపాల్‌కు ఎంపీడీవో సూచించారు. అలాగే మందమర్రి పట్టణంలోని పాతబస్టాండ్ ఏరియాలో అద్దె భవనంలో కొనసాగుతున్న మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలికల పాఠశాల, కళాశాల భవనం ప్రధాన ద్వారానికి(గేట్)కు మంగళవారం భవన యజమాని తాళం వేశారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రధాన గేటుకు పక్కనున్న చిన్న గేటు నుంచి లోపలికి వెళ్లారు. ఈ విషయమై భవన యజమాని సతీశ్‌ను వివరణ కోరగా.. ఎనిమిది నెలల అద్దె రూ. 16 లక్షలు రావాల్సి ఉందని, ప్రభుత్వం వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
తాళం వేసి తీసిన యజమాని
బెల్లంపల్లి, అక్టోబర్ 15 : బెల్లంపల్లిలోని మహాత్మాగాంధీ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల భవన యజమాని చిదిరాల భావన రుషి తాళం వేసి వెంటనే తీసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో యథావిధిగా తరగతులు కొనసాగాయి. ఇదిలా ఉంటే భవనానికి తాళం వేసి ఉపాధ్యాయులు, విద్యార్థినులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని ప్రిన్సిపాల్ రమాదేవి ఫిర్యాదు మేరకు భావనరుషిపై కేసు నమోదు చేశారు.