కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : వాగు ఉప్పొంగడంతో ఉ పాధ్యాయులు రాత్రంతా పాఠశాలలోనే గడపాల్సి వ చ్చింది. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిం ది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెల్కగూడ-వాడిగొంది గ్రామాలు సుమారు పది.. పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.
ఆయా గ్రామాల్లోని పాఠశాలల్లో పనిచేస్తే టీచర్లు స్వాతి, సుమలత, నైతం హరిప్రకాశ్, కుర్సెంగ జాలింషా ఎప్పటిలాగే బుధవారం ఉదయం విధులకు వెళ్లారు. సాయంత్రం విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా, ఎగువన కురుస్తున్న వర్షాలకు చెల్కగూడ వాగు ఉప్పొంగింది. వరద ఉధృతి తగ్గుతుందేమోనని సుమారు రెండు మూడు గంటల పాటు అక్కడే వేచి చూశారు. వాగు నిండుగా ప్రవహిస్తుండడంతో తిరిగి చెల్కగూడ పాఠశాలకు వెళ్లి రాత్రంగా అక్కడే గడిపారు. గురువారం ఉదయం గ్రామస్తులంతా కలిసి వీరిని వాగు దాటించారు.
వంతెన నిర్మించాలని అర్ధనగ్న ప్రదర్శన
చెల్కగూడ వాగుపై వంతెన నిర్మించాలని వాడిగొంది-చెల్కగూడ గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం వాగులో దిగి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి నిరసన తెలిపారు. సరైన రోడ్డు వసతితో పాటు వంతెన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఏదైనా ఆపద వస్తే కనీసం దవాఖానలకు వెళ్లలేని దుస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మా బాధలు తీర్చాలని డిమాండ్ చేశారు.