ఎదులాపురం, నవంబర్ 14: గ్రంథాలయాలు.. విజ్ఞాన భాండాగారాలు అని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని లైబ్రెరీలో గ్రంథాలయ వారోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గ్రామీణ ప్రాంతాల్లో లైబ్రెరీలు ఉండేవి కాదని, పట్టణ ప్రాంతాలకెళ్లి చదుకోవాల్సి వచ్చేదన్నారు.
ప్రస్తుతం పల్లెల్లో సైతం గ్రంథాలయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు మంచి వేదికలుగా నిలుస్తున్నాయన్నారు. మొబైల్ ఫోన్లను పకన పెట్టి పుస్తక పఠనం చేస్తే మంచి జ్ఞానం వస్తుందన్నారు. గ్రంథాలయాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, లైబ్రెరియన్లు శ్రీనివాస్, శివాజీ, కవులు బొల్లారం బాబన్న, మురళీధర్, సిబ్బంది, పోటీ పరీక్షల అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.