కౌటాల, మే 24: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప (Koneru Konappa) అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు రోడ్లు, వంతెనల కోసం కేసీఆర్ దగ్గర అడగగా అవన్నీ మంజూరు చేశారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులన్నింటినీ రద్దు చేసిందని విమర్శించారు. కౌటాల మండలం గుండైపేట వార్ధా నదిపై వంతెన నిర్మిస్తే ఈ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతుందని కేసీఆర్‌తో మాట్లాడి రూ.75 కోట్లు మంజూరు చేయించానన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ టెండర్‌ను రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ముందే సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి కౌటాల మండలంలో వంతెన మంజూరు చేయాలని కోరానని, ఆయన దానికి సానుకూలంగా ఉన్నట్లు తెలిపి తీరా టెండర్‌ను రద్దు చేశారని ఆరోపించారు. అదేవిధంగా నియోజకవర్గంలో 11 రోడ్లు కావాలని మంత్రి సీతక్కకు చెప్పగా, తాను మంజూరు చేస్తానని చెప్పినప్పటికీ ఏ ఒక్క రోడ్డు కూడా ఇప్పటికీ రాలేదని చెప్పారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోయేందుకు తాను ప్రణాళికలు సిద్ధం చేసి పార్టీకి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినా ఎక్కడా స్పందన లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధిలో ఎలాంటి మార్పు జరగలేదని తెలిపారు.
సిర్పూర్ మండలం నాగమ్మ చెరువులో బుద్ధుని విగ్రహం చుట్టూ అభివృద్ధి చేసేందుకు రూ.4 కోట్లు మంజూరు చేస్తామని ఇప్పటివరకు దాన్ని ఊసే లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో గూడెం వద్ద వంతెన నిర్మిస్తే అది ఇప్పుడు మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎంతో లాభదాయకంగా మారిందన్నారు. దానివల్ల చింతనపల్లి మండలం ఊహించని విధంగా అభివృద్ధి సాధించిందని చెప్పారు. తాను ఏ పార్టీలో లేనప్పటికీ తనను నమ్ముకుని తన వెంట ఉండేందుకు బీజెపి, బీఎస్పీ పార్టీల నుండి వచ్చిన కార్యకర్తలకు తాను పాత కార్యకర్తల వలె సమానంగా చూస్తానన్నారు. ఈనెల 25న చింతలమానపల్లి మండలంలో కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి కోనేరు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.