కుమ్రం భీం ఆసిఫాబాద్ : త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు(Collector Hemanth) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అకౌంటింగ్ టీం సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల, 10వ తేదీ నామినేషన్ సమర్పించేందుకు ఆఖరు తేది అని, 13న నామినేషన్ల పరిశీలన, 15న అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరణ, 30వ తేదీన పోలింగ్, డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ జరుగుతాయని, ఎన్నికల నిబంధనలు డిసెంబర్ 5వ తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు.
ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేయలెన్స్ టీం, వీడియో సర్వేయలెన్స్ టీం, వీడియో పరిశీలన టీం, అకౌంటింగ్ టీమ్ లను నియమించినట్లు తెలిపారు. జిల్లాలోని 001-సిర్పూర్, 005-ఆసిఫాబాద్ నియోజకవర్గంలో జరగనున్న ఎన్నికలలో పోటీ చేయు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ద్వారా నిర్వహించే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్ షోలు అన్నింటిని వీడియో సర్వేయలెన్స్ టీం సభ్యులు రికార్డింగ్ చేసి, వీడియో పరిశీలన సభ్యుల ద్వారా సదరు వీడియోను పరిశీలించి వివరాలను అకౌంటింగ్ టీం సభ్యులకు అందిస్తారని, అకౌంటింగ్ టీం సభ్యులు వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు. అనంతరం పూర్తి వివరాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అకౌంటింగ్ టీం నోడల్ అధికారి, డి.టి.ఓ. రాజేశ్వర్, అకౌంటింగ్ టీం అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.