కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ప్రాజెక్టు మనుగడ ప్రమాదంలో పడింది. ఇటీవల కురిసిన వర్షాలతో కట్ట కుంగిపోయి, పగుళ్లు తేలుతున్నది. ఇప్పటికే కట్టకు రక్షణగా ఉండే సైడ్వాల్ కూలిపోయింది. కట్టపై మట్టి కొట్టుకపోకుండా పాలిథిన్ కవర్లను కప్పి అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. అదే విధంగా ప్రాజెక్టులో నీటి సామర్థ్యాన్ని సగానికే పరిమితం చేస్తున్నారు.
జిల్లాలోని ప్రాజెక్టుల్లో కుమ్రం భీం ప్రాజెక్టు అతి పెద్దది. 10 టీఎంసీల సామర్థ్యంతో 45 వేల ఎకరాలకు సాగునీరు అం దించేందుకు నిర్మించారు. ఈ ఏడాది ఇప్పటి వర కు కురిసిన ఒకటి రెండు వర్షాలకే ఆనకట్ట బీటలు వారింది. భారీ వర్షాలతో కట్ట మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది. కట్ట బలహీనంగా మారడంతో పూర్తి స్థాయి సామర్థ్యం 10 టీఎంసీలకు గాను 4 నుంచి 5 టీఎంసీలకే అధికారులు పరిమితం చేస్తున్నారు. ఇన్ఫ్లోని ఎప్పటికప్పుడు గమనిస్తూ మిగతా నీటిని గేట్లు ఎత్తి వదిలేస్తున్నారు.
ప్రాజెక్టు కట్టపై సన్నగా మొదలైన పగుళ్లు పెద్దగా బీటలు వారుతున్నాయి. కట్టపై వేసిన తారు రోడ్డు కు సైతం బీటలు వస్తుండడం, కట్టకు రక్షణ నిర్మించిన సైడ్వాల్ వరద తాకిడికి ధ్వంసమైంది. బీటలు వారిన చోట్ల వర్షపు నీరు నేరుగా కట్టపై పడకుండా, మట్టి కొట్టుకపోకుండా పాలిథిన్ కవర్లను కప్పి ఉంచుతున్నారు. వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టు రక్షణకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.