కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): కుమ్రం భీం ప్రాజెక్టు పరిస్థితి ప్రశ్నార్థకరంగా మారింది. మూడేళ్లుగా ప్రాజెక్టు కట్టకు పగుళ్లు తేలుతుండడంతో కట్ట బలహీన పడుతున్నది. వర్షాలతో కట్ట కుంగిపోవడంతో సైడ్ వాల్ కూలిపోయింది. వర్షాల నుంచి కుంగిపోతున్న ఆనకట్టను కాపాడేందుకు అధికారులు పాలిథీన్ కవర్లను కప్పి కట్టను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టును ప్రస్తుతం 4 నుంచి 5 టీఎంసీల వరకే నీటి నిల్వకు పరిమితం చేసేలా చర్యలు చేపట్టారు. ఒక వేళ భారీ వర్షాలు వస్తే కుమ్రం భీం ప్రాజెక్టు కట్ట మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రభుత్వం రూ.18 కోట్లు కేటాయించింది. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనే పెద్ద ప్రాజెక్టుగా పేరున్న కుమ్రం భీం ప్రాజెక్టు మనుగడకే ముప్పు కలుగుతున్నది. 45 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు 10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు ఎంతోకాలం నిలువదేమోనన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రాజెక్టు ఆనకట్ట బీటలు వారుతుండడంతో ప్రాజెక్టు బలహీనపడుతున్నది. ప్రాజెక్టుకు ఆనుకొని ఉన్న కొండలపై నుంచి, వాగుల్లోని పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నది.
ప్రాజెక్టు కట్ట మూడేళ్లుగా బీటలు వారుతున్నది. భారీ వర్షాలు వస్తే కట్ట మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోని ఎప్పటికప్పుడు గమనిస్తున్న అధికారులు ప్రాజెక్టులోకి వరద రూపంలో వచ్చిన నీటిని వచ్చినట్లే గేట్లను ఎత్తి వదిలేస్తున్నారు. ప్రాజెక్టులో 4 నుంచి 5 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా చూస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం వరకు నీటిని నిల్వచేస్తే కట్ట కొట్టుకపోయే ప్రమాదం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వర్షాలకు ప్రాజెక్టు కట్ట కొట్టుకపోకుండా ఉండేందుకు వర్షపు నీరు నేరుగా కట్టపై పడకుండా పాలిథీన్ కవర్లను కప్పి ఉంచుతున్నారు.
ఒక వేళ భారీ వర్షాలు కురిస్తే కట్టకు వేసిన మట్టి కొట్టుకపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్టు కట్టకు సన్నగా మొదలైన పగుళ్లు పెద్ద బీటలుగా మారుతున్నాయి. కట్టపై వేసిన తారు రోడ్డుకు సైతం బీటలు వస్తుండడం, కట్టకు రక్షణ నిర్మించిన సైడ్వాల్ వరద తాకిడికి ధ్వంసం కావడంతో ప్రాజెక్టు కట్ట బలహీనంగా మారుతున్నది. పాలిథీన్ కవర్ల ద్వారా వర్షపు నీరు పగుళ్లలోకి వెళ్లకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు మరమ్మతులకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రాజెక్టుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
జిల్లాలో 45 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతుల ఆశలు నీరుగారుతున్నాయి. కుమ్రం భీం ప్రాజెక్టుకు గతంలో ప్రభుత్వం 18 కోట్ల రూపాయలను కేటాయించింది. కాని నిధులు విడుదల కాకపోవడంతో ఎలాంటి మరమ్మతులు ప్రారంభం కాలేదు. మూడేళ్ల నుంచి కట్టపై కవర్లు కప్పి ఉంచుతున్న అధికారులు ప్రాజెక్టు పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుమ్రం భీం ప్రాజెక్టు నీటి సామర్థ్యం 10 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు తగ్గించడంతో ప్రాజెక్టు కింద ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీళ్లు ఉన్నప్పుడు ప్రధాన కాలువ ద్వారా కాగజ్నగర్ వరకు నీళ్లు పారేవి. చెరువులు నింపి వానాకాల పంటలతోపాటు, యాసంగి పంటలకు నీరు పుష్కలంగా అందేది. మూడేళ్లుగా కట్ట బీటలుపడుతుండడంతో కట్ట బలహీన పడుతున్నది. దీని కారణంగా ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి సామర్థ్యాన్ని పూర్తిగా ఉంచలేకపోతున్నారు. ప్రాజెక్టు కింద ఆయకట్టుకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు స్పందించి ఆనకట్టకు మరమ్మతులు చేయించి ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.