మంచిర్యాల, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్ ఒంటరైపోయారా.. అంటే అవుననే సమాధానం వస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రిపదవి రేసులో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. అనూహ్యంగా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్‌కు పదవి దక్కింది. దీంతో కొన్ని రోజులుగా పీఎస్సార్ తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తున్నారు. రెండో మంత్రివర్గ విస్తరణలో చోటుదక్కకపోవడం, ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వివేక్‌కు పదవి ఇవ్వడంతో ఆయన తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పోయేది లేదని, అధిష్టానం కాస్త సమయం తీసుకుంటుందని చెప్పారు.
తననే నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటానంటూ స్పష్టం చేశారు. తనకు ఎవ్వరూ మంత్రులు లేరని.. సీఎం రేవంత్‌రెడ్డి తన బాస్ అని.. మంచిర్యాలకు నేనే రాజు, నేనే మంత్రి అంటూ ప్రకటించారు. మరో మంత్రివర్గ విస్తరణలోనైనా పదవి వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లో తాజ్‌కృష్ణ హోటల్లో బస చేస్తున్న ఖర్గేను కలిసేందుకు రావాలని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు ఆహ్వానం వచ్చింది.
ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ఖర్గేతో భేటీ అయ్యారు. మంత్రి పదవి ఇవ్వడం కుదరదని, దానికి బదులు ప్రభుత్వ చీఫ్ విప్ ఇస్తామని ఖర్గే ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఇందుకు పీఎస్సార్ ఆ విప్ పదవి తనకు అవసరం లేదంటూ అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. భట్టి విక్రమార్క బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని తెలిసింది. ఈ నేపథ్యంలో పీఎస్సార్ ఏం చేస్తారోనన్న చర్చ తెరపైకి వచ్చింది.
కానీ గాంధీభవన్‌లో శుక్రవారం నిర్వహించిన పార్టీ మీటింగ్‌కు పీఎస్సార్ హాజరయ్యారు. కాకపోతే పీఎస్సార్ వాహనాన్ని పోలీసులు గాంధీ భవన్‌లోకి అనుమతించకపోవడం సైతం చర్చనీయాంశంగా మారింది. కేవలం మంత్రుల వాహనాలకే అనుమతి ఉందని, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాహనాలు లేకుండా లోపలికి వెళ్లాలని చెప్పడంతో కాసేపు వాగ్వాదాం అనంతరం పీఎస్సార్ నడుచుకుంటూ గాంధీభవన్‌లోకి వెళ్లారు. ఆయన వెంట ఎంపీ రేణుకా చౌదరి సైతం నడుస్తూనే లోపలికి వెళ్లారు. మంత్రి పదవి విషయంలో అలకబూనిన ఎమ్మెల్యే వాహనాన్ని గాంధీ భవన్‌లోకి అనుమతించకపోవడం సైతం మంచిర్యాల జిల్లా కేంద్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఫలించని మంత్రాంగం.. మండిపడుతున్న పీఎస్సార్ వర్గం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడింది మా ఎమ్మెల్యే పీఎస్సార్. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీ ఆయన్ని తీవ్రంగా అవమానించిందని ఆయన అనుచరులు, కార్యకర్తలు వాపోతున్నారు. ఏళ్లుగా పార్టీని నమ్ముకొని నిలబెట్టిన పీఎస్సార్‌ను కాదని, ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి పదవి ఇవ్వడం ఏమిటని మండిపడుతున్నారు. మా సార్‌ను, పార్టీని నమ్ముకొని ఉన్న మా పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు పీఎస్సార్‌కు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మరోమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ముందు నుంచి అండగా ఉంటూ వస్తున్నారు. మంత్రి పదవికి పీఎస్సార్ అన్ని విధాలా అర్హుడంటూ అధిష్టానానికి వారు రెఫర్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ అధిష్టానం ఆ మంత్రుల మాటలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదని తెలిసింది. ఇక తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను సైతం కలిసి తనకు మంత్రి పదవి ఇవ్వాలని పీఎస్సార్ విజ్ఞప్తి చేశారు. అక్కడి నుంచి సైతం మద్దతు లభించలేదు.
అనూహ్యంగా గడ్డం వివేక్‌కు మంత్రివర్గంలో చోటుదక్కింది. ఆ సమయంలో మీనాక్షి నటరాజన్ స్వయంగా పీఎస్సార్‌ను కలిసి మరీ తొందరపడొద్దని, పార్టీ మంచి పదవి ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోమల్లికార్జున్ ఖర్గేతో భేటీ అనగానే మంత్రి పదవిపై మళ్లీ పీఎస్సార్ వర్గంలో ఆశలు చిగురించాయి. కానీ విఫ్ పదవి ఆఫర్ చేయడం, దాన్ని ఆయన తిరస్కరించి అలిగి రావడం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీని కుదిపేసింది. పీఎస్సార్ కోసం మంత్రులు చేసిన ప్రయత్నాలు సైతం ఫలించకపోవడంతో ఆయన వర్గం నాయకులు అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కీలక సమయంలో ఇలాంటి పరిస్థితి రావడం, ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒంటరి పోరాటమే..
రెండో మంత్రివర్గ విస్తరణకు ముందు నుంచి పీఎస్సార్‌కు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అంతకు ముందు అన్ని నియోజకవర్గాల్లో పీఎస్సార్‌కు ప్రత్యేకమైన పట్టు ఉండేది. ఎన్నికల సమయంలో చెన్నూర్, బెల్లంపల్లి సహా ఇతర నియోజకవర్గాల్లో ఆయన అనుచరులకు నిరాశ ఎదురైంది. దీంతో ఆయన ప్రాభవం తగ్గిపోయింది. ఏదేమైనా పార్టీలో సీనియర్ నాయకుడిగా ఆయనకే మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక్కటైపోయారు. బెల్లంపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేతో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఓరియెంట్ సిమెంట్ (అదానీ) ఫ్యాక్టరీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాసిపేటకు చెందిన విక్రమ్రావ్ను బలపరిచారు. అప్పటికే ఈ ఎన్నికల్లో పీఎస్సార్ తమ్ముడు సత్యపాల్రావ్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి ఓ వ్యక్తిని బలపరచడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇది జరిగిన కొన్ని రోజులకే పీఎస్సార్‌కు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. దీనికి తోడు గడిచిన రెండురోజులుగా హైదరాబాద్‌లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇక ఉమ్మడి జిల్లా హస్తం పార్టీలో పీఎస్సార్ ఒంటరైపోయినట్లేనని టాక్ నడుస్తున్నది. ఇకపై ఏం చేసినా ఆయనకు ఎదురుగాలి తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలపై పీఎస్సార్ ఎలా స్పందిస్తారు.. ఆయన ఏం చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది.