కుభీర్, ఆగస్టు 21 ః పేదింటి ఆడ బిడ్డలకు పెండ్లి సమయంలో వారి తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న కల్యాణలక్ష్మి-షాదీముబారక్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యులు కిరణ్ కొమ్రేవార్, లోలం శ్యాం సుందర్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు అనిల్ అధ్వర్యంలో శుక్రవారం గులాబీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ మీదుగా శ్రీవిఠలేశ్వరాలయం నుంచి బజార్ గల్లీ గుండా పాత బస్టాండు, యాదవ సంఘం, భట్టీగల్లీ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని బైఠాయించారు. ముందుగా అన్నాబావు సాఠే, ఛత్రపతి శివాజీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీవిఠలేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్, సుంకెట పోశెట్టి, మాజీ వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, టౌన్ అధ్యక్షుడు గంధం పోశెట్టి, మాజీ సర్పంచ్ జీ.బాబు, కోర్వ శ్యాం, పడకంటి దత్తు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కే.రాజన్న, సుద్ద యోగేశ్, సోషల్ మీడియా మండల ఇన్చార్జి గడ్డం సంజీవ్, దొంతుల దేవీదాస్, డాక్టర్ దత్తుసింగ్, జీ.కాశీనాథ్, చిన్నపార్డి దత్తాత్రి, గడ్పాలే దత్తాత్రి, ఏశాల విఠల్, హల్ద జీవన్, ఎకీనోద్దిన్, వడ్నం రవి, చొండి దర్పెలి మధు, ఆరెల్లి పోతన్న యాదవ్ పాల్గొన్నారు.