ఇంద్రవెల్లి, జూలై12 : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అధికారులకు సూచించారు. దస్నాపూర్, సట్వాజిగూడ, ప్రబుద్ధనగర్, మిలింద్నగర్తో పాటు మండలకేంద్రంలోని పలు వార్డుల్లో ఆమె పర్యటించారు. వర్షపు నీరు చేరిన ఇళ్లను పరిశీలించారు. తెగిపోయిన దస్నాపూర్ బ్రిడ్జి, కోతకు గురైన రోడ్లు, పంట పొలాలను పరిశీలించి బాధితుల వివరాలను సేకరించారు. అధికారులు పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. వరద ముప్పున్న గ్రామాలను గుర్తించి అక్కడి ప్రజలకు ముందస్తుగా అప్రమత్తం చేయాలని ఆదేశించారు. టీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని సూచించారు. ఆమె వెంట పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు షేక్ సూఫియాన్, నాయకులు దేవ్‌పూజె మారుతి, కోరెంగా సుంకట్రావ్, నగేశ్ ఉన్నారు.
ఉట్నూర్ రూరల్, జూలై 12: మండలంలోని లక్కారంలో ఇళ్లల్లోకి నీరు చేరగా, ఆ గ్రామాన్ని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పరిశీలించారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచించారు. ఆయన వెంట కార్యక్రమంలో జీవ వైవిధ్య మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి, దావుల రమేశ్, ప్రకాశ్, రామారావు, రవి, సాజిద్ పాల్గొన్నారు.
బేల,జూలై 12 : పెన్‌గంగ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ బడాల రాంరెడ్డి కోరారు. మండలంలోని బెదోడ, సాంగిడి, మణియార్‌పూర్ గ్రామాల పరీవాహక ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ఎస్సీ బాలుర పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.
ఆదిలాబాద్ టౌన్, జూలై12 : ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్, గుండంలొద్దిలో ఎస్ఐ హరిబాబు పర్యటించార. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఎంపీటీసీ జంగుబాపు,నాగోరావు,అశోక్ ఉన్నారు.
ఆదిలాబాద్ రూరల్, జూలై 12: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మావల చెరువు నిండిందని, అటు వైపు ఎవరూ వెళ్లవద్దని టీఆర్ఎస్ నాయకుడు నల్లా రాజేశ్వర్ విజ్ఞప్తి చేశారు. ఎస్ఐ విష్ణుతో కలిసి చెరువు ప్రాంతాన్ని మంగళవారం పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి టీఆర్ఎస్ కార్యకర్తలు సాయం అందించాలని సూచించారు. ఆయన వెంట ఉప సర్పంచ్ మహేందర్, నాయకుడు విజయ్ ఉన్నారు.