రెండో అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థానం నిత్య పూజలు, వ్రతాలు, నోములతో అలరారుతున్నది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు గూడెం రమాసహిత ఆలయంతో పాటు అయ్యప్పస్వామి, షిర్డీసాయిబాబా, ఆంజనేయస్వామి, శనేశ్వర, సదానందస్వామి గుళ్లను దర్శించుకుంటుండగా, సరికొత్త శోభ సంతరించుకుంటున్నది. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుండగా, ఆలయ సిబ్బంది ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.
దండేపల్లి, నవంబర్ 2 : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని దండేపల్లి మండలం గూడెంలోని ఆలయాలు సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. కరీంనగర్- జగిత్యాలకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న శ్రీ సత్యనారాయణస్వామి, అయ్యప్పస్వామి, షిర్డీసాయిబాబా, ఆంజనేయస్వామి, శనేశ్వర, సదానందస్వామి ఆలయాలు భక్తుల రద్దీతో కళకళలాడుతున్నాయి.
సత్యనారాయణస్వామి దేవస్థాన ప్రాశస్త్యం
1964లో గూడెం గ్రామానికి చెందిన గోవర్ధనపు పెరుమాల్‌లు అనే భక్తుడికి కలలో దేవుడు ప్రత్యక్షమై తాను కొండపైన ఉన్నానని చెప్పాడట. తెల్లవారి వెళ్లి చూస్తే అక్కడ ఏమీ కనిపించలేదు. మరుసటి రోజు రాత్రి మళ్లీ కలలోకి వచ్చి గుట్టపైనే వెతకమని చెప్పారట. ఉదయం గోదావరిలో స్నానం ఆచరించి గుట్టపై వెతుకగా సత్యనారాయణస్వామి, రమాదేవి విగ్రహాలు లభించాయి. విగ్రహాలకు గోదావరిలో పుణ్యస్నానం చేయించి గుట్టపై ప్రతిష్ఠ చేసి పూజలు చేశారు. కాలక్రమేనా ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది.1975లో రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయశాఖ ఆధీనంలోకి తీసుకుంది. దీనికి చైర్మన్‌గా వంశపారంపర్యంగా పెరుమాల్‌లు కుమారుడు గోవర్ధన వెంకటస్వామి కొనసాగారు. యేటా కార్తీక మాసం పౌర్ణమి రోజున వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని, సామూహిక వ్రతాలు ఆచరిస్తారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచేగాక ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. అలాగే మాఘమాసంలో ఏడురోజుల పాటు బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణం నిర్వహిస్తారు.
గూడెంలో వివిధ దేవస్థానాల విశిష్టత..
సత్యనారాయణస్వామి దేవస్థానం గుట్టకు ఆనుకొని ఉన్న మరో గుట్టపై వెలిసిన అయ్యప్ప దేవస్థానం అభినవ శబరిమలైగా ప్రసిద్ధిచెందింది. శబరిమలైలో ఉన్న అయ్యప్పదేవాలయాన్ని పోలి ఉండేలా ఈ దేవాలయాన్ని నిర్మించారు. యేటా కార్తీకపౌర్ణమిరోజు దేవస్థానంలో అయ్యప్ప భక్తులు దీక్షలు తీసుకుంటారు. శబరిమలై వెళ్లలేని వారు గూడెం అయ్యప్ప దేవాలయంలో దీక్షలు విరమిస్తుంటారు. కార్తీకమాసంలో శనేశ్వర, శ్రీషిర్డిసాయిబాబా, ఆంజనేయ స్వామి, సదానంద ఆలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
ఈ నెల 5,6,7 తేదీల్లో కార్తీక పూజలు
రమాసహిత శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 5,6,7 తేదీల్లో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 5న విశ్వక్సేణ ఆరాధన, పుణ్యహవాచనము, అంకురారోపణము,అగ్ని ప్రతిష్ఠ, నిత్య హవణము, బలిహరణం, తీర్థప్రసాద వితరణ, గోధూళిక సుమూహూర్తమున తులసీ కల్యాణం, 6న నిత్యహవణము, బలిహరణము, తీర్థప్రసాద వితరణ, 7న నిత్యహవణము, బలిహరణము, మహా పూర్ణాహుతి, యజ్ఞపరిసమాప్తి, మహాదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 8న కార్తీక పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 5 గంటలకు దేవాలయం మూసివేసి తిరిగి 9న ఆలయ సంప్రోక్షణ అనంతరం ఉదయం 9 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఉత్సవ కార్యక్రమాలకు ఎంపీ వెంకటేశ్‌నేతకాని, ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు. భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాల ఆర్టీసీ వారు ప్రత్యేకంగా బస్సులు నడపనున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన ఏసీపీ
ఈ నెల 5,6,7 తేదీల్లో కార్తీక పూజలు నిర్వహించనుండగా, ఏసీపీ తిరుపతిరెడ్డి బుధవారం ఏర్పాట్లు పరిశీలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచేగాక పక్క జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముందని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఘాట్ రోడ్డు వద్ద భారీకేడ్లు ఏర్పాటు చేయాలని, గోదావరి తీరం వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేదపండితులు, అర్చకులు ఏసీపీని సన్మానించి ఆశీర్వచనాలు అందించారు. లక్షెట్టిపేట సీఐ కరీముల్లా ఖాన్, ఎస్ఐ సాంబమూర్తి, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, ఆలయ సిబ్బంది ఉన్నారు.
సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు
గూడెం రమాసహిత ఆలయంలో బుధవారం కార్తీక సందడి నెలకొంది. వేకువ జామునే భక్తులు పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. నదిలో కార్తీక దీపాలు వదిలారు. భక్తులు స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో దంపతులు సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు ఆచరించారు. అనంతరం ఆలయంలో అభిషేకాలు చేశారు. గుట్ట పైభాగంలో ధ్వజస్తంభం వద్ద, గుట్ట కింద భాగంలో రావి చెట్టు వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో గుట్ట పైభాగంలో తాత్కాలిక షెడ్లు వేసి వ్రతాలు జరిపించారు.