గోదావరిఖని,నవంబర్ 11: ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌కు పీఎంవో కార్యాలయం నుంచి పిలుపు అందలేదు.. నామ్‌కే వాస్తేగా కేంద్ర రసాయన ఎరువుల శాఖ నుంచి ఆహ్వానం పంపించి అవమానించారని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చావు అంచుల దాకా వెళ్లి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌ను అవమానిస్తే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని చెప్పారు. ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజలంటే ఎందుకంత చులకన అని నిలదీశారు. శుక్రవారం గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేతకాని, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. శనివారం రామగుండానికి వస్తున్న ప్రధాని మోదీ..గని కార్మికులపై ప్రేమ ఉంటే సింగరేణిని ప్రైవేట్‌పరం చేయబోమని, ఇన్‌కంట్యాక్స్ రద్దు చేయాలని, పెన్షన్ పెంచాలని, సింగరేణి 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలని, 11వ వేతన ఒప్పందం ప్రకారం వేతనాల పెంపుపై స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఆదిలాబాద్ సీసీఐని ప్రారంభించాలని, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని, కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయాలని, రాష్ర్టానికి 10 మెడికల్ కాలేజీలు ఇవ్వాలని, ఆరు వరుసల రాజీవ్ రహదారి నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవేమి చేయకుండా ఆర్భాటం కోసం ఇక్కడికి వస్తే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మోదీకి మోకరిల్లుతున్నారని, అభివృద్ధిని విస్మరించి ఆయన చెప్పులు మోసే పనిలో నిమగ్నమయ్యారని దెప్పిపొడిచారు. కర్ణాటకలో ముఖ్యమంత్రికి ఏ విధంగా గౌరవం ఇచ్చారో? పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలుస్తున్నదని, తెలంగాణ అంటే ఎందుకంత చులకన? అని ప్రశ్నించారు. ఇక్కడ రామగుండం నగరపాలక సంస్థ మేయర్ బంగి అనిల్‌కుమార్, కార్పొరేటర్లు, టీ(బీ)ఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.