బజార్హత్నూర్, ఏప్రిల్ 16 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటినా ఇప్పటివరకు తులం బంగారం ఊసెత్తడం లేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 46 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు.
వేదిక ఆవరణలో లబ్ధిదారులు ప్లకార్టులతో సీఎం రేవంత్రెడ్డి తులం బంగారం ఎప్పుడిస్తావు? అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఓట్ల కోసమే మాయమాటలు చెప్పి హామీలు, ఇచ్చాడని ఇప్పుడు నెరవేర్చడంలో జాప్యం చేస్తున్నాడని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే తులం బంగారం అందించాలని డిమాండ్ చేశారు.