కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కవ్వాల్ టైగర్ జోన్.. కాగజ్‌నగర్ టైగర్ జోన్‌గా మారనుందా..! కాగజ్‌నగర్ అటవీ ప్రాంతాన్ని పులుల సంరక్షణ కేంద్రంగా మార్చేందుకు అటవీ శాఖ రహస్య నివేదిక సిద్ధం చేస్తున్నారా…? ఇటీవల జిల్లాలో పులుల సంచారం పెరగడం..కాగజ్‌నగర్ అడవుల్లో మూడు రోజుల పాటు పీసీసీఎఫ్ డోబ్రివాల్ పర్యటించడం..తదితర తాజా పరిణామాలు, పరిస్థితులను పరిశీలిస్తే ఈ ప్రాంతం టైగర్ జోన్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్, కన్నెర్గాం టైగర్ జోన్లలో నుంచి ప్రాణహిత ద్వారా జిల్లాలోకి ప్రవేశిస్తున్న పులులు కాగజ్‌నగర్ అడవుల్లో సంచరిస్తున్నాయి. జిల్లాలో ఇద్దరిపై పులి దాడి చేయగా ఓ మహిళ చనిపోయింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అనేక పశువులు పులుల దాడులకు గురై మృతి చెందగా మరికొన్ని గాయాలపాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని టైగర్ కారిడార్‌గా ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై అటవీ అధికారులు నివేదికలు తయారు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
12 ఏళ్లుగా కవ్వాల్‌లో నివాసం ఉండని పులి
కవ్వాల్ టైగర్ జోన్(983 చదరపు కిలోమీటర్లు ) ఏర్పాటు చేసి 12 సంవత్సరాలవుతున్నది. ఇప్పటి వరకూ ఒకటి రెండు సార్లు పులి కనిపించి వెళ్లిపోయిందని కాని స్థిర నివాసం ఏర్పర్చుకోలేదు. కవ్వాల్ అడవులు శాఖాహార అటవీ జంతువులు తప్ప పులులు నివాసం ఉండేందుకు యోగ్యంగా లేవని తేలిపోయింది. 12 ఏళ్లుగా నివాసం ఏర్పర్చుకొని ఇక ముందు కూడా ఈ ప్రాంతంలో నివాసం ఉంటుందనే నమ్మకం లేకుండా పోయింది. టైగర్ జోన్లో నాలుగేళ్ల కాలంలో పులులు నివాసం ఉండకపోతే దానిని ఎత్తివేసే అవకాశాలు ఉంటాయి. దీంతో అటవీ అధికారులు పులుల సంచారం అధికంగా ఉన్న కాగజ్‌నగర్ అడవులపై దృష్టి సారించారు.
పులులకు సేఫ్‌గా కాగజ్‌నగర్ అడవులు
మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్, కన్నెర్గాం టైగర్‌జోన్‌ల నుంచి ప్రతి సంవత్సరం పులులు రాకపోకలు పెరిగుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో సుమారు 8 పులులు స్థావరాలను ఏర్పాటు చేసుకోగా.. మహారాష్ట్రలోని టైగర్‌జోన్‌ల నుంచి ఇక్కడికి వలస వచ్చే పులుల సంఖ్య పెరుగుతున్నది. జిల్లాలో ఎనిమిది కంటే ఎక్కువే ఉండవచ్చని తెలుస్తున్నది. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతం తడోబా, ఇంద్రావతి, అభయారణ్యాలకు కారిడార్ ఉండడంతో పులులు స్వేచ్ఛగా ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నాయి. దట్టమైన అడవులు, పుష్కలమైన నీటి వనరులు, వణ్యప్రాణులు ఉండడమే కారణం
నివేదికలు సిద్ధం ?
మూడు రోజుల పాటు జిల్లాలోని కాగజ్‌నగర్ అడవుల్లో పర్యటించిన పీసీసీఎఫ్ డోబ్రివాల్, మహారాష్ట్రలోని అటవీ అధికారులతో కో ఆర్డినేషన్ మీటింగ్ కూడా నిర్వహించారు. 12 ఏళ్లుగా పులులు నివాసం ఉండని కవ్వాల్ టైగర్‌జోన్ కంటే పులులు అధికంగా సంచరించే కాగజ్‌నగర్ అడవులను పులులకు సేఫ్ జోన్‌గా తీర్చిదిద్దడంపై దృష్టిసారించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకు రహస్య నివేదికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
త్వరలోనే తడోబా, తిప్పేశ్వర్, కన్నెర్గాం టైగర్జోన్లలో అధ్యయనానికి వెళ్లనున్నట్లు ప్రకటించారు. కాగజ్‌నగర్ కారిడార్‌ని ఏర్పాటు చేస్తామని పీసీసీఎఫ్ డోబ్రియాల్ చెప్పారు. భవిష్యత్‌లో కాగజ్‌నగర్ టైగర్‌జోన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఇప్పటికైతే లేదు.. కాని భవిష్యత్‌లో ఏమీ చెప్పలేమని అంటూ మాటను దాటవేశారు..దీనిని బట్టి కాగజ్‌నగర్ టైగర్ జోన్ ఏర్పాటుకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తడోబా, తిప్పేశ్వర్, కన్నెర్గాం టైగర్‌జోన్‌ల నుంచి ప్రాణహిత దాటుకొని ఇక్కడికి వలస వచ్చేపులులు ఇక్కడే ఉండేందుకు అనువైన ప్రాంతంగా.. మరింత సురక్షితంగా ఉండే అడవులుగా కాగజ్‌నగర్ ఫారెస్ట్‌ను తీర్చిదిద్దనున్నారు.