కడెం, ఆగస్టు 6 : కడెం.. జలాశయం చుట్టూ సహ్యాద్రి కొండలు.. మేఘాలను తాకినట్టుండే గుట్టలు.. పచ్చదనంతో ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరిచే దట్టమైన వనం.. నీలిరంగు వర్ణంతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న నీరు.. జలంపై బోటులో విహారం చేస్తుంటే ఆ మధురానుభూతే వేరు. వీటికితోడు రిసార్ట్, పిల్లల కోసం పార్కు, రెస్టారెంట్, కాన్ఫరెన్స్ హాల్.. ఇలా కడెం ప్రాజెక్టు పర్యాటకులను రా.. రమ్మని పిలుస్తోంది. రాష్ట్ర సర్కారు వసతులు కల్పించడంతో ఉమ్మడి జిల్లాతోపాటు, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. విడిది గదులు ఉండడంతో యేటా పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. వీటితోపాటు వివాహ వేడుకలకు.. వెడ్డింగ్ షూట్ల కోసం వస్తున్నారు. సినీ హీరో శ్రీరాం సినిమా షూటింగ్ కోసం ప్రాజెక్టు పరిధిలోని రిసార్ట్ గదుల్లో 10 రోజులు ఉన్నారు.
కడెంలోని రిసార్ట్లో ప్రస్తుతం 12 ఏసీ గదులున్నాయి. ఇక్కడ గణనీయంగా పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పర్యాటకశాఖ అధికారులు మరిన్ని గదులను ఏర్పాటు చేసి, పర్యాటకులకు వసతులు కల్పించాలని భావించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న నీటిపారుదల శాఖ విశ్రాంతి భవనం వద్ద కూడా పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై ఇటీవలే ఆ శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. ఇక్కడ అదనపు గదులను ఏర్పాటు చేస్తే కడెం పర్యాటకంగా అభివృద్ధి చెందనుంది.