కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలకేంద్రం కానోబా గల్లీలో ప్రసిద్ధిగాంచిన పురాతన శ్రీకృష్ణ ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు (Janmastami Celebrations ) ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో పూజారులు అభిషేకం (Abhishekam) , పుష్పార్చన నిర్వహించారు. అనంతరం ఆలయంలో వార్కరి సంప్రదాయ బద్ధులైన విట్టల్ మహారాజ్ కీర్తన, భజన కార్యక్రమాలను కొనసాగించారు.
మూడు రోజుల పాటు ఘనంగా జరిగే ఈ వేడుకలకు కుభీర్తో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. అష్టమి రోజైన శనివారం ఉదయం స్వామివారికి అభిషేకం, పట్టు వస్త్రాల సమర్పణ, ఊయల కార్యక్రమంతో పాటు భక్తులకు అన్న ప్రసాద వితరణ జరగనుందని నిర్వహకులు తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు తిప్పబోజన్న, సభ్యులు పుప్పాల పిరాజి, భజన మండలి సభ్యులు గిరి పోశెట్టి, ఆలయ కమిటీ సభ్యులు వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.