నిర్మల్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో రైస్ మిల్లర్ల చేతివాటం పతాకస్థాయికి చేరుకున్నది. సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యం విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ, కొంతమంది మిల్లర్లు అవేమి పట్టించుకోకుండా యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. 2025-26 యాసంగి, వానకాలం సీజన్లకు సంబంధించి రైస్ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యం లెక్కలను తేల్చేందుకు గత వారం పది రోజులుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అధికారులు బృందాలుగా ఏర్పడి రైస్‌మిల్లుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఆయా మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ ధాన్యం వివరాలతోపాటు ధాన్యాన్ని మిల్లింగ్ చేయగా.. నిల్వ ఉన్న బియ్యం వివరాలు పరిశీలించి నమోదు చేస్తున్నారు.
ఇలా జిల్లాలో ఇప్పటివరకు 5 మిల్లులను తనిఖీ చేయగా మూడు మిల్లుల్లో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లు సోమవారం నిర్వహించిన విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో గల శ్రీ లక్ష్మీనరసింహా పేరిట ఒకటి రా రైస్‌మిల్, మరొకటి బాయిల్డ్ రైస్‌మిల్.. ఈ రెండు మిల్లులను స్థానికంగా గల ఓ అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మిల్లుల్లో గత యాసంగి, వానకాలం సీజన్లలో సీఎంఆర్ కోసం ఇచ్చిన ధాన్యం మాయమైనట్లు తేల్చారు. అలాగే 2022-23 యాసంగికి సంబంధించి వేలం కోసం కేటాయించిన 1,545 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు చెబుతున్నారు. దీని విలువ దాదాపు రూ.3.45 కోట్లు ఉంటుందని అధికారులు తేల్చారు.
అలాగే గత రెండు సీజన్లకు (2025-26 యాసంగి, వానకాలం) సంబంధించి దాదాపు 6 వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. దీని విలువ దాదాపు రూ.16 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఒకే వ్యక్తి పేరు మీద ఉన్న ఈ రెండు మిల్లుల్లో ఏకంగా రూ.19.45 కోట్ల విలువైన 7,600 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం కావడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మూడు సీజన్లకు సంబంధించిన ధాన్యం నిల్వల్లో తీవ్ర కొరత ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో స్పష్టమైంది. ఈ తనిఖీల సమాచారం అందగానే మిల్లు నిర్వాహకులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తున్నది.
స్వర్ణ గ్రామంలోని లక్ష్మీ నరసింహా రైస్‌మిల్లుల్లో సీఎంఆర్ కోసం కేటాయించిన ధాన్యా న్ని మిల్లింగ్ చేయగా వచ్చిన బియ్యాన్ని సమీపంలోనే ఉన్న మహారాష్ట్రకు తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు. స్వర్ణ గ్రామానికి, మహారాష్ట్ర సరిహద్దు కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. దీంతో ఇక్కడ మిల్లింగ్ చేసిన బియ్యాన్ని మహారాష్ట్రలోని ఉమర్‌ఖేడ్ ప్రాంతానికి తరలించి.. అప్పటికే అక్కడ ఏ ర్పాటు చేసుకున్న గోదాముల్లో పెద్ద ఎత్తున ని ల్వ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అ క్కడి నుంచి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రలకు బియ్యం రవాణా చేస్తూ రూ. కోట్లలో అక్రమ ఆర్జన చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రతి రెండు, మూడు రోజులకు ఒకసారి ఇక్కడి నుంచి పదుల సంఖ్యలో లా రీల్లో బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు త రలించేవారని స్థానికులు చెబుతున్నారు. ఇం త యథేచ్ఛగా అక్రమ బియం రవాణా జరుగుతున్నా అధికారులు, పోలీసుల కంట పడకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
సీఎంఆర్ అక్రమ దందా ఒక్క స్వర్ణ మిల్లుకే పరిమితం కాలేదు. అధికారులు తనిఖీలు చేస్తున్న దాదాపు అన్ని మిల్లుల్లోనూ కాస్త అటూ ఇటుగా ధాన్యం మాయమైనట్లు బయటపడుతున్నది. ఇటీవల లోకేశ్వరం మండలం సాద్గాం గ్రామ శివారులో గల గజానంద్ రైస్ మిల్లులో అధికారులు తనిఖీలు నిర్వహించగా, 2 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. దీని విలువ దాదాపు రూ.4.72 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ మిల్లు కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధిదేనని చెబుతున్నారు. అలాగే ఇటీవల కుంటాల మండల కేంద్రంలో గల ఓ రైస్ మిల్లులో, తాజాగా మంగళవారం ఖానాపూర్ మండలం సత్తనపెల్లి గ్రామంలో గల మరో రెండు మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఆయా మిల్లుల్లో కూడా అక్రమాలు జరిగినట్లు ప్రాథమింగా గుర్తించారు. అయితే మాయమైన ధాన్యానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు చెబుతుండడం వెనుక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఉన్నాయన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సత్తనపెల్లిలో గల రెండు మిల్లులు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడివే అన్న సంగతి బహిరంగ రహస్యమే. ఈ మిల్లుల్లో గతేడాది కూడా పెద్ద ఎత్తున్న అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఏది ఏమైనా విజిలెన్స్ అధికారుల వరుస తనిఖీలు బియ్యం మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. పేదల బియ్యాన్ని, ప్రభుత్వ సొమ్మును స్వాహా చేస్తున్న మిల్లర్ల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నది. కాగా సీఎంఆర్ ధాన్యం విషయంలో అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని, రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం మిల్లులను సీజ్ చేసి, నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సంబంధిత శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.