సారంగాపూర్, ఫిబ్రవరి 13 : ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మూడు విడుతలుగా నిర్వహించనుండగా.. మొదటి విడుత రేపటి(బుధవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 156 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనరల్ 19,148, వృత్తి విద్యా కోర్సు 7,396 మంది మొత్తం 26,244 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు సోమవారం ఇంటర్ విద్యాశాఖ కార్యాలయాల్లో ఉన్నతాధికారులు ప్రిన్సిపాళ్లు, చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించారు. పరీక్షల కమిటీలను ఎన్నుకున్నారు. పరీక్షా కేంద్రానికి ఒక గంట ముందే విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. రేపటి(బుధవారం) నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వహించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పరీక్షల నిర్వహణపై చర్చించేందుకు, సూచనలు చేసేందుకు సోమవారం జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ కార్యాలయాల్లో ఆయా జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఆయా జిల్లాల పరీక్షల నిర్వహణ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులు విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 156 కేంద్రాలు
బుధవారం నుంచి మూడు విడుతలుగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ జనరల్ గ్రూపులో ద్వితీయ, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు పరీక్షలు జరుగునున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ జూనియర్ కళాశాలలకు చెందిన జనరల్ గ్రూపుల విద్యార్థులు 19,148, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులు 7,396 మొత్తం మంది 26,544 ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు.
ఏ సమయమో జాగ్రత్తగా చూసుకోవాలి..
ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మధ్యా హ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. విద్యార్థులు తాము ఏ సమయంలో పరీక్షకు హాజరుకావాల్సి ఉందో హాల్‌టికెట్‌పై జాగ్రత్తగా చూసుకోవాలి. తగినట్టుగా హాజరుకావాలి. ఇందులో ఈనెల 15 నుంచి 20 వరకు మొదటి విడుత, 21 నుంచి 25 వరకు రెండో విడుత, 26 నుంచి మార్చి 2 వరకు మూడో విడుత జరుగనున్నాయి.
వెబ్సైట్లో హాల్‌టికెట్లు..
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థులకు సకాలంలో అందించాలని అధికారులు ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు కావాల్సిన అడిషనల్ షీట్లు, ఎథిక్స్ ఎన్విరాన్మెంటల్ పరీక్షా సమాధాన పత్రాలను ఇంటర్ విద్యాశాఖ కార్యాలయం నుంచి పంపిణీ చేస్తున్నారు.
పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశాం..
ఈనెల 15 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశాం. మూ డు విడుతల్లో పరీక్షలు జరగనున్నా యి. మొదటి విడు త బుధవారం, రెం డో విడుత ఈనెల 21, మూడో విడుత ఈనెల 26 నుంచి జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 వరకు ఒక పరీక్షా, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు రెండో పరీక్షా ఉంటుంది. ఒక గంట ముందే విద్యార్థులు సెంటర్‌కు చేరుకోవాలి. ప్రతి విద్యార్థికి హాల్ టికెట్ అందించాలని ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్‌కు సూచించాం.
– జాదవ్ పరశురాం, డీఐఈవో నిర్మల్