తెలంగాణ రాష్ట్ర సర్కారు కులవృత్తులకు జీవం పోస్తున్నది. నిరాదరణకు గురైన కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నది. కల్లు గీత వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే రెంటల్, పన్ను రద్దు, మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్, లైసెన్స్ ఫీజు మాఫీ, లైసెన్స్ రెన్యూవల్‌ను పదేండ్లకు పెంచడం వంటివి చేసింది. దీనికితోడు తాజాగా రైతుబీమా తరహాలో గీత కార్మికులకు కూడా రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నది. 18-59 ఏళ్ల లోపు ఉండి, కల్లు గీత లైసెన్సు కలిగిన కార్మికుడికి బీమా వర్తించనుంది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 1230 మందికి లబ్ధి చేకూరనుంది.
నిర్మల్, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులు నిరాదరణకు గురయ్యాయి. కుల వృత్తిని నమ్ముకొని జీవించే వారు కూలీనాలీ చేసుకుంటూ పొట్ట పోసుకోవాల్సి వచ్చేది. కొన్ని కుటుంబాలు జీవనోపాధికి ఇతర ప్రాంతాలకు వలస పోయేవి. ప్రధానంగా కల్లు గీత కార్మికులను నాటి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో కులవృత్తులు ప్రాణం పోసుకున్నాయి. ఇందులో భాగంగానే గీత కార్మికులకు రెంటల్, చెట్లపై విధించే పన్నును రద్దు చేశారు. సొసైటీ లైసెన్సు ఫీజును మాఫీ చేశారు.
గతంలో ఐదేళ్లకోసారి లైసెన్సు రెన్యూవల్ చేసుకోవాల్సి వచ్చేది. దానిని పదేండ్లకు పొడిగించారు. తాజాగా గీత కార్మికులకు బీమా సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించింది. 18-59 ఏళ్ల వయస్సు లోపు ఉండి, కల్లుగీత లైసెన్సు కలిగిన ప్రతి గీత కార్మికుడికి బీమా వర్తిస్తోంది. గతంలో తాటి, ఈత చెట్లపై నుంచి పడి మరణిస్తేనే ఎక్స్‌గ్రేషియా వచ్చేది. ఇక నుంచి ఏ కారణం చేతనైనా, సహజ మరణమైనా ఆ కుటుంబానికి భరోసా కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వం గీత కార్మికులకు బీమాను అమలు చేయనున్నది. గతంలో రూ.2 లక్షలు ఉన్న ఎక్స్‌గ్రేషియాను రూ.5 లక్షలకు పెంచిన ప్రభుత్వం.. ఈ సహాయాన్ని బీమా క్లెయిమ్ రూపంలో ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించనున్నది.
గీత కార్మికులకు అండగా సర్కారు
నిర్మల్ జిల్లావ్యాప్తంగా 35 సొసైటీల పరిధిలో 754 మంది సభ్యులు ఉన్నారు. ఆయా సొసైటీలు గతంలో యేటా 7.41 లక్షలు లైసెన్సు ఫీజు రూపంలో ప్రభుత్వానికి చెల్లించేవి. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని పూర్తిగా రద్దు చేసింది. జిల్లా వ్యాప్తంగా 204 కల్లు విక్రయ దుకాణాలు ఉండగా, 764 మంది లైసెన్సును కలిగి ఉన్నారు. వీరంతా యేటా 9.77 లక్షలను లైసెన్సు ఫీజు కింద ప్రభుత్వానికి చెల్లించేవారు. వీటిని కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా యేటా జిల్లాలోని 1,518 మంది గీతకార్మికులు చెల్లించే 17.18 లక్షల ఫీజును మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది.
గత ప్రభుత్వాల్లో గీత కార్మికులకు పింఛన్ పథకం వర్తించేది కాదు. స్వరాష్ట్రంలో 50 ఏళ్ల వయస్సు నిండిన వారందరికీ ఆసరా పథకాన్ని వర్తింపజేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 275 మంది గీత కార్మికులకు ప్రతి నెల 2,016 పింఛన్ వస్తున్నది. గతంలో గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కిందపడి మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా గత ప్రభుత్వాలు వారి కుటుంబానికి కేవలం రూ.2 లక్షలు మాత్రమే పరిహారం ఇచ్చేవి. స్వరాష్ట్రం వచ్చాక ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారాన్ని అందిస్తున్నది. అంతే కాకుండా హరితహారంలో భాగంగా ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,13,000 తాటి, ఈత చెట్లను నాటించింది. తొలిసారిగా గౌడ సామాజిక వర్గానికి మద్యం దుకాణాల కేటాయింపులో 15 శాతం రిజర్వేషన్లను కల్పించింది. కాగా.. నిర్మల్ జిల్లాలో లైసెన్స్ కలిగిన వారిలో అర్హులైన 1,230 మంది వివరాలు ప్రభుత్వానికి పంపించామని, ఉత్తర్వులు త్వరలో వెలుబడే అవకాశం ఉందని ఆబ్కారీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.