ఉట్నూర్, మార్చి 21: ప్రత్యేక అవసరాల పిల్లలకు వినికిడి పరికరాలు అందించడం అభినందనీయమని, మరిన్ని సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. ఉట్నూర్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికాసం పాఠశాలలో వినికిడి లోపం పిల్లలకు హైదరాబాద్కు చెందిన ఆశ్రయ్ ఆకృతి కంపెనీ రూ.10 లక్షల విలువైన వినికిడి పరికరాలు అందించడంపై వారికి ఐటీడీఏ పీవో కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీవో పీవీటీజీ మనోహర్, ఏవో రఘు, ఏటీడీవో క్రాంతి, పాఠశాల ప్రిన్సిపాల్ వికాస్, ఉపాధ్యాయులు, ఆకృతి సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.
గిరిజన గ్రామాల్లో తాగునీటి సరఫరా బాధ్యత పంచాయతీ సెక్రెటరీలదేనని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. శుక్రవారం కుమ్రం భీం ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ మండలాల పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండల దృష్ట్యా గిరిజన గ్రామాల్లో నీటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇంటింటికీ మంచినీళ్లు అందించాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రెటరీలదేనని ఆదేశించారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, క్లోరినేషన్ జరిగే విధంగా చూడాలని ఎంపీవోలను ఆదేశించారు. ఈ సమావేశంలో ఈఈ తానాజీ, డీఈ శివప్రసాద్, డీఎల్పీవో ప్రభాకర్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ సెక్రెటరీలు, సిబ్బంది ఉన్నారు.