ఎదులాపురం, మే 22 : ఇటీవల ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్లు లక్కీడ్రాలో దివ్యాంగులకు తీవ్రంగా అన్యాయం జరిగిందని హ్యాండీక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎండీ. ఇమ్రన్ ఆరోపించారు. శుక్రవారం స్థానిక ప్రింట్ మీడియా ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘దివ్యాంగులకు ఇందిరమ్మ ఇండ్లు రాకుండా చేస్తున్న ద్రోహులు మున్సిపల్ కమిషనర్, చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లు’ అనే కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో నిర్వహించిన లక్కీడ్రాలో చాలా మంది దివ్యాంగుల పేర్లు వచ్చాయన్నారు.
కానీ కాంగ్రెస్ హయంలో నిర్వహించిన లక్కీ డ్రాలో దివ్యాంగులకు ఒకటి కూడా కేటాయించలేదన్నారు. గతంలో లక్కీడ్రాలో ఎంపికైన పేర్లను సైతం ప్రస్తుతం తీసివేయడం సరికాదన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అన్యాయం జరిగితే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పైసల్ అహ్మద్, సభ్యులు తారా ఉషన్న, మెషీన్, అమీర్, మహమ్మద్, ఇక్బాల్ తదితరులు ఉన్నారు.