మంచిర్యాల, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం(టీఎన్జీవో) హౌసింగ్ సొసైటీలో అక్రమాల బాగోతం బయటపడుతున్నది. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 42 సర్వే నంబర్లో ఈ సొసైటీకి 32 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. 2010లో 350 మంది ఉద్యోగులకు ప్లాట్లు కేటాయిస్తూ అప్పటి తహసీల్దార్ పట్టా సర్టిఫికెట్లు జారీ చేశారు. దీంతో కొందరు ఇదే భూమిని ప్రభుత్వం గతంలో తమకు కేటాయించిందంటూ కోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో కోర్టు నుంచి తొమ్మిదెకరాలకు క్లీయరెన్స్ రావడంతో ఫస్ట్ ఫేస్‌లో కొంత మంది టీఎన్జీవోలు ఇండ్లు కట్టుకున్నారు. ప్రస్తుతం రెండో దశలో 72 మంది ఇండ్లు కట్టుకుంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. 2010లో ఉద్యోగులకు కేటాయించిన ప్లాట్ల సీరియల్ నంబర్ల ప్రకారం కాకుండా రీ డిజైన్ పేరిట ఇష్టారాజ్యంగా ప్లాట్లను కేటాయిస్తున్నారు. దీంతో ఒక ఉద్యోగికి కేటాయించిన సీరియల్ నంబర్ ప్లాట్‌లో మరొక ఉద్యోగి వచ్చి ఇల్లు కడుతున్నాడని రిటైర్డ్ టీఎన్జీవోలు ఆరోపిస్తున్నారు. న్యాయంగా ఎవరికీ కేటాయించిన ప్లాట్ నంబర్ వారికి ఇవ్వకుండా ఎవరైతే బిల్డర్‌కు రూ.5 లక్షలు ఇచ్చారో వారికి ఇదే నీ ప్లాట్ అంటూ చూపిస్తున్నారు తప్పితే.. వాస్తవంగా ఆ ప్లాట్ తనదో కాదో ఇల్లు నిర్మిస్తున్న ఉద్యోగికి కూడా క్లారిటీ లేదు. నిబంధనల ప్రకారం ఒక్కో ఉద్యోగికి ప్రభుత్వం 175 స్కేర్ ఫీట్ల చొప్పున ప్లాట్లు కేటాయించింది. కానీ.. గతంలో టీఎన్జీవోలో పని చేసి ఇప్పుడు టీజీవోలో కీలక పదవిలో ఉన్న ఓ ఉద్యోగి, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత కార్యదర్శి, టీఎన్జీవో కానీ ఓ ఎన్జీవో అధికారులు మాత్రం 175 స్కేర్ ఫీట్ల కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు కుట్టుకున్నారు. గవర్నమెంట్ 175 గజాలు ఇస్తే 40 గజాల నుంచి 50 గజాల అదనపు ల్యాండ్ ఆక్రమించుకుని ఇండ్లు కట్టుకున్నారని తోటి ఉద్యోగులే మండిపడుతున్నారు. బిల్డర్‌కు రూ.5 లక్షలు, డెవలప్మెంట్ చార్జి లక్ష రూపాయలు, ఎన్వోసీకి రూ.30 వేలు, మున్సిపాలిటీలో ఇంటి పర్మిషన్‌కు రూ.30 వేల చొప్పున ఎవరైతే డబ్బులు చెల్లిస్తారో వారికే ప్లాట్లు కేటాయిస్తున్నారంటూ.. హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రిటైర్డ్ టీఎన్జీవో ఉద్యోగులు సీసీఎల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎల్ఏ కలెక్టర్‌ను నివేదిక కోరింది. ఈ మేరకు కలెక్టర్ జిల్లా సహకార శాఖ అధికారి సంజీవరెడ్డిని అడిట్ నిర్వహించి నివేదిక సమర్పించాలంటూ ఆదేశించారు.
టీఎన్జీవోలు హౌసింగ్ సొసైటీకి కేర్ టేకర్లు మాత్రమే.. కానీ.. సర్వే నంబర్ 42కి తామే పట్టాదారులమన్న చందంగా వ్యవహరిస్తుండడం అనేక విమర్శలకు తావిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాపాడుకోవడం చేతకాక కోర్టుల్లో కేసులు వేసిన వారందరికీ సెటిల్మెంట్ చేస్తూ భూములను ధారాదత్తం చేశారు. ప్రభుత్వ భూమిని సెటిల్మెంట్ చేసి వేరే వారికి అప్పగించే అధికారం టీఎన్జీవోలకు ఎవరిచ్చారు అనేది ఇక్కడ అర్థంకాకుండా పోయింది. టీఎన్జీవోలకు ఇచ్చిన భూమి మాకు ప్రభుత్వం అసైన్ చేసిందంటూ ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కోర్టులో కేసు వేశారు. అది ఎంతకీ తేలకపోవడంతో హడావుడిగా ఓ పెద్దమనిషిని మధ్యవర్తిగా పెట్టి రెండెకరాల భూమికి సెటిల్మెంట్లో భాగంగా ఆ వర్గానికి టీఎన్జీవోలు కట్టబెట్టారు. ఆ భూమిని వారు వేరే వారికి విక్రయించినట్లు తెలుస్తున్నది. ఇది పూర్తిగా ఇల్లీగల్ అయినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ రెండు ఎకరాల్లో చేస్తున్న ఇండ్ల నిర్మాణాలను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు, ఆ పంచాయతీ కొలిక్కి రాకుండానే 72 టీఎన్జీవోలకు ఇండ్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఎలా ఇచ్చారు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే ఎవరైతే ఈ రెండెకరాల సెటిల్మెంట్లో కీలకంగా వ్యవహరించిన ఆ పెద్ద మనిషిని 30 గుంటల టీఎన్జీవో స్థలాన్ని ఆక్రమించుకుని తన భూమిలో కలుపుకున్నట్లు మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఆక్రమించుకున్న భూమిలో ఫంక్షన్ హాల్ నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకోగా.. ఆ భూమిని సర్వే చేసిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు రెండు రోజలు క్రితం కాంపౌండ్ వాల్‌ను కూల్చివేసి అది ప్రభుత్వ భూమి అని, టీఎస్జీవోలకు కేటాయించిన భూమి అని తేల్చారు. ఇప్పటికైనా టీఎన్జీవోలు ఆ భూమిలో పొజిషన్ తీసుకోవాలని చెప్తున్నారు. ఆ రెండెకరాలు, ఈ 30 గుంటలు సెటిల్మెంట్లో టీఎన్జీవో అధ్యక్షుడు కీలకంగా వ్యవహరించారని, అందుకే ఆ పెద్ద మనిషినే బిల్డర్‌గా పెట్టి ఒక్కో ఫ్లాట్‌పై రూ.5లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రెండెకరాల 30 గంటలతోపాటు మరో ఐదున్నర ఎకరాలు కోర్టు కేసులో ఉంది. ఓ సింగరేణి లీడర్ పక్క సర్వే నంబర్ 40 వేసుకొని వచ్చి సర్వే నంబర్ 42లో టీఎన్జీవోల భూమిని కబ్జా చేసి ఐదు అంతస్తుల భారీ భవనం కట్టారు. ఈ చిక్కులన్నింటికీ కారణం టీఎన్జీవో పాలకవర్గమే అంటూ.. కాపాడుకోవాల్సిన భూమిని అక్రమార్కుల పాలు చేశారంటూ రిటైర్డ్ టీఎన్జీవో ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో అక్రమాలంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా కో-ఆపరేటివ్ అధికారి డీసీవో సంజీవరెడ్డి ఎంక్వైరీ మొదలుపెట్టారు. మొత్తంగా 17 అంశాలపై వివరణ ఇవ్వాలంటూ టీఎన్జీవో అధ్యక్షుడు శ్రీహరికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాగా.. నోటీసుకు వివరణ ఇచ్చేందుకు అధ్యక్షుడు వారం రోజుల సమయం అడిగినట్లు తెలిసింది. ఫ్లాట్లను సీరియల్ నంబర్స్ ప్రకారం కేటాయించారా.. ఎలా కేటాయించారు. హౌసింగ్ సొసైటీకి ఎన్నికలు నిర్వహిస్తున్నారా లేదా ఆడిట్ చేస్తున్నారా లేదా.. డబ్బులు వసూలు చేసింది నిజమేనా ఇలా వివిధ అంశాలపై అధ్యక్షుడిని రికార్డులు సడ్మిట్ చేయాలని కోరినట్లు డీసీవో చెప్పారు. దీనికి వారం రోజుల సమయం అడిగారని, మేం మూడు రోజుల్లో ఇవ్వాలని చెప్పాలని డీసీవో తెలిపారు. టీఎన్జీవో అధ్యక్షుడు సమయం అడగడం వెనక ఆంతర్యం ఇప్పటికే ప్రారంభించి పూర్తయ్యే దశలో ఉన్న ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవడం అని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఒకటి, రెండు ఇండ్ల నిర్మాణాలు పూర్తికాగా, వారం పది రోజుల్లోనే కొన్ని ఇండ్లపై సెకండ్ ఫ్లోర్ కోసం స్లాబ్‌లు వేశారు. ఈ ఇండ్లన్నీ కూడా టీఎన్జీవోలో కీలక లీడర్లవి అని చెప్తున్నారు. ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించినప్పటికీ ఆగకుండా వేగంగా నిర్మాణాలు చేస్తూ పోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంక్వైరీ అయ్యి నిజానిజాలు బయటికి వచ్చే వరకు ఆగాలని కొందరు టీఎన్జీవోలే డిమాండ్ చేస్తున్నారు. కట్టిన ఇడ్లను కూల్చేసైనా సరే సీరియల్ నంబర్ల ప్రకారం ఫ్లాట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అదే జరిగితే ఇప్పుడు హడావుడిగా కడుతున్న నిర్మాణాలను కూల్చేయక తప్పదా? అని ఇండ్లు కట్లుకుంటున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఫ్లాట్ల కోసం రూ.6.50 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు ఇచ్చుకున్నామని, ఇప్పుడు అవి ఉంటాయో లేదో అని భయమేస్తుందని వాపోతున్నారు.
టీఎన్జీవో హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరగలేదు. కొందరు రిటైర్డ్ ఎంప్లాయీస్‌కు ఇచ్చిన ఫ్లాట్లు కలెక్టరేట్ రోడ్లో పోయాయి. వాటికి ప్రత్యామ్నాయంగా మరోచోట ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఫ్లాట్స్ రావనే భయంతో ఇదంతా చేస్తున్నారు. కొందరు లీడర్లకు 175 స్కేర్ ఫిట్స్ కంటే ఎక్కువ స్థలంలో ఇండ్లు కట్టుకున్నది నిజమే. అప్పుడు నేను అధ్యక్షుడిగా లేను. ఎంక్వైరీలో అది నిజమని తేలితే ఏం చేయాలో ప్రభు త్వం చూసుకుంటుంది. 350 మంది పాత వారికి తప్ప కొత్త వారికి ఎవరికీ ప్లాట్లు ఇవ్వలేదు. షోకాజ్ నోటీసుకు వారం రోజుల సమయం అడిగాం. కచ్చితంగా సహకరిస్తాం. – శ్రీహరి, టీఎన్జీవో,అధ్యక్షుడు