హాజీపూర్ : తెలంగాణకు హరితహారం ( Haritha Haram ) పేరుతో పచ్చదనాన్ని పెంపొందించేందుకు నిరంతరం మొక్కలు నాటుతుంటే, మరోవైపు అదే చెట్లను కొందరు వ్యక్తులు నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మంచిర్యాల ( Mancherial ) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్, రోడ్ నెంబర్ 9 లో దశాబ్ద కాలంగా పెరిగి నీడనిచ్చే స్థాయికి చేరిన హరితహారం చెట్లను పూర్తిగా నరికి మొండాలుగా మార్చేశారు.

విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న కొమ్మలను మాత్రమే తొలగించాల్సి ఉండగా, చెట్లనే వేరుతో సహా నరికి వేయడం పర్యావరణ ప్రేమికులను కలిచివేస్తోంది. స్థానికుల కథనం ప్రకారం.. సుమారు 100కు పైగా చెట్లను నరికి ఒక ప్రాంతంలోని పచ్చదనాన్ని మొత్తం తుడిచి పెట్టేశారని డివిజన్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంలో విద్యుత్ శాఖ అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్నాయని చెబుతూ చెట్లను పూర్తిగా నరికివేయడానికి కొందరు వ్యక్తులకు సహకారం అందించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని కోరుతున్నారు.