బోథ్, సెప్టెంబర్ 11: బీఆడుతున్న సంక్షేమ పథకాలకు రాజకీయ పక్షాల నాయకులు జై కొడుతున్నారు. గులాబీ కండువా కప్పుకునేందుకు ముందుకు వస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జాదవ్ అనిల్‌ను ప్రకటించడంతో ప్రతి పక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు వెంట నడవడానికి ముందుకు వస్తున్నారు.
అభ్యర్థి జాబితా ప్రకటన నుంచి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యక్తలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. బోథ్‌లోని పరిచయ గార్డెన్లో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది గులాబీ పార్టీలో చేరారు. ధన్నూర్ (బీ), బోథ్ తదితర గ్రామాలకు చెందిన మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ఉపసర్పంచ్, యువజన విభాగం నాయకులు, ప్రతినిధులు పార్టీలో చేరారు. జాదవ్ అనిల్ అభ్యర్థిత్వం ప్రకటించిన నాటి నుంచి బీఆర్ఎస్లో చేరికల తీరును చూస్తే భారీ మెజారీటీతో విజయం సాధించడం ఖాయమని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నారు.