Government hospitals | నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. నుంచి నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు.. అనేంత స్థాయికి హాస్పిటల్స్ మారాయి. స్వరాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ సీఎం అయ్యాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్‌ను తలదన్నే రీతిలో వసతులు కల్పించి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అధునాతన పరికరాలు సమకూర్చడం, సిబ్బందిని నియమించడం వల్ల పేషెంట్ల సంఖ్య గణనీ యంగా పెరిగింది. దీనికితోడు రాష్ట్ర సర్కారు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, 102 వాహనాలు సమకూర్చడం, నగదు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు చేస్తూ ప్రోత్సహిస్తు న్నది. ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తుండడంతో గర్భిణులరాక పెరుగుతున్నది. కాగా.. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో యేడాదిలో జరిగిన ప్రసవాలపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం..
– ఎదులాపురం, మే 6
ఎదులాపురం, మే 6 : ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, నగదు, అమ్మ ఒడి, 102 వాహనాలతోపాటు ఇతర పథకాలు అమలు చేస్తుండడంతో ప్రసవాలు చేయించుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. జిల్లావ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీలు, రెండు సీహెచ్‌సీలు, రిమ్స్‌లో యేడాదిలో జిల్లావ్యాప్తంగా 9,652 ప్రసవాలు జరగగా.. ఇందులో 7,361 సాధారణ.. 2,291 సిజేరియన్లు అయ్యాయి. జిల్లా వైద్యారోగ్యశాఖ నివేదిక ప్రకారం.. యేడాది కాలంగా జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో 3,567 ప్రసవాలు జరగగా.. ఇందులో 524 సాధారణం, 3,043 సిజేరియన్లు అయ్యాయి.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో 85 శాతం సిజేరియన్లు అవుతుండగా.. కేవలం 15 శాతం సాధారణం అవుతున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో 76 శాతం సాధారణ ప్రసవాలు కాగా.. 108 వాహనం, ఇళ్లలోనే రెండు శాతం అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కాగా.. కొన్ని ప్రైవేట్ దవాఖానల్లో మొదటిసారి ప్రసవానికి వచ్చే వారిని సాధారణ కాన్పునకు ప్రోత్సహించకుండానే సిజేరియన్లు చేస్తున్నారు. ఇలా మొదటిసారి వచ్చిన వారు రెండోసారి కూడా అదే ఆస్పత్రికి రావాల్సి ఉంటుంది. ఒక్కో ప్రసవానికి రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు ఖర్చవుతున్నది. మొదటి, రెండోసారి ప్రసవాలకు వచ్చిన వారికి మొత్తం సుమారుగా రూ.80 వేలు అవుతున్నాయి.
సాధారణ కాన్పుల వల్ల ప్రయోజనాలు
మహిళలు రెండు రోజుల్లోనే పనులు చేసుకోవడానికి వీలుంటుంది. ఎటువంటి దుష్పరిణామాలు ఉండవు. రెండో కాన్పుపై దుష్ప్రభావం ఉండదు. గర్భసంచికి కూడా ఏ ప్రమాదం ఉండదు. గర్భాశయానికి వ్యాధులు సోకవు. భవిష్యత్‌లో రుగ్మతలకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
తరచూ విరేచాల బారిన పడే అవకాశాలు..
శస్త్రచికిత్స సందర్భంగా గర్భ సంచి పక్కనే ఉండే మూత్రాశయానికి కూడా ఇబ్బందులు ఏర్పడొచ్చు. దీంతో రక్తం ఊపిరితిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీన్ని వైద్య పరిభాషలో ఎంబోలిజం అంటారు. దాదాపు ఆరు నెలలపాటు బరువైన పనులు చేయవద్దు.
సిజేరియన్ కాన్పుల వల్ల దుష్పరిణామాలు..
రెండో సిజేరియన్ కాన్పు సమయంలో లేదా గర్భిణికి తొమ్మిదో నెలలో గర్భసంచికి అంతకు ముందు సీజేరియన్ కాన్పు సమయంలో వేసిన కుట్లు విడిపోయే ప్రమాదం ఉంటుంది. గర్భాశయానికి గాట్లు పెట్టి కుట్లు వేసిన ప్రాంతంలో మాయ అతుక్కుపోయే అవకాశాలుంటాయి. దీంతో భవిష్యత్‌లో అప్పుడపు్పుడు తీవ్ర కడుపునొప్పి వచ్చే అవకాశాలుంటాయి. శస్త్రచికిత్స కాన్పు సమయంలో రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో గర్భ సంచి తొలగించే పరిస్థితి తలెత్తవచ్చు.
అన్ని పీహెచ్సీలలో సాధారణ ప్రసవాలు
ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పీహెచ్సీలలో వంద శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం అయ్యే వరకు ప్రతినెలా ఉచితంగా మందులు, స్కానింగ్, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. క్రమం తప్పకుండా ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు గర్భిణులకు సేవలు అందిస్తున్నారు. అలాగే న్యూట్రిషన్ కిట్స్ అందిస్తున్నాం. అత్యవసరం అయితే తప్పా సిజేరియన్ చేయడం లేదు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లతో పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది.
– నరేంద్రర్ రాథోడ్, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్