మంచిర్యాల, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘ఏయ్ వెంకటేశ్.. రాంచందర్ అన్నను ఏట మధుకర్ వాళ్ల నాన్న ముందు కూర్చోబెట్టు..’ అని గోమాస శ్రీనివాస్.. వెంకటేశ్ నేతకు చెబుతూనే ఆయనపై చేయి వేశారు. ‘ఆపై నువ్వు జరుగురా తమ్మి’ అని కూడా అనగా, ఇందుకు వెంకటేశ్‌నేత స్పందిస్తూ ‘అరేయ్ గిరేయ్ అంటావ్.. చెంప పగులుద్ది.. నోర్మూయ్.. అరేయ్ అంటావా ఇడియట్’ అని సీరియస్ అయ్యారు. మళ్లీ గోమాస శ్రీనివాస్ కలగజేసుకొని ‘ఏం మాట్లాడుతున్నావ్.. బట్టలు ఊడదీసీ కొడుతా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కింద కూర్చున్న వెంకటేశ్ నేత కోపంతో పైకి లేచే ప్రయత్నం చేయగా, అక్కడున్న నాయకులు భుజాల మీద చేతులు వేసి కూర్చోబెట్టారు.
ఇక నేతలిద్దరూ తిట్టుకుంటుండగా బాధిత కుటుంబ సభ్యులు ‘అయ్యా.. మీ కాళ్లు మొక్కుతాం.. ఇక్కడ గొడవ వద్దు అయ్యా’ అంటూ బతిమిలాడడం కనిపించింది. ఈ ఘటన ఇటీవల చనిపోయిన వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు ఏట మధుకర్ కుటుంబాన్ని మంగళవారం పరమార్శిస్తున్నప్పుడు జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వేమనపల్లి మండలం నీల్వాయిలో బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తుండగా, పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేశ్‌నేత, బీజేపీ నుంచి పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు గోమాస శ్రీనివాస్ బాహాబాహీకి దిగడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బీజేపీ నాయకుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకేనా మీరు పరామర్శకు వచ్చిందంటూ పలువురు మండిపడుతున్నారు. చనిపోయిన దగ్గర వ్యక్తిగత రాజకీయాలు ఏంటి.. ఇలాగే వ్యవహరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీల నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. బీజేపీ కార్యకర్త ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు, పోలీసుల వేధింపుల కారణంగానే బీజేపీ మండలాధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులు పూర్తి కావస్తున్నా ఇంత వరకు దీనికి కారకులైన వారిని అరెస్టు చేయలేదన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వం ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను రక్షిస్తుందని అర్థమైందన్నారు. ఇలాంటి కాంగ్రెస్ నాయకులకు ఎట్టిపరిస్థితుల్లో భయపడేది లేదన్నారు.
బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపే సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని అడ్డుకొని తీరుతామన్నారు. మధుకర్ ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్ట్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ 48 గంటల టైమ్ ఇచ్చారని, కానీ ఇప్పటి దాకా ఎవ్వరినీ అరెస్టు చేయలేదన్నారు. దీనిపై రామగుండం కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని, పోలీసులు చర్యలు తీసుకోలేని పక్షంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు