మంచిర్యాల, జూలై 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షల వరకు రుణాలు తెచ్చుకోండి. అధికారంలోకి వస్తే వెంటనే మాఫీ చేస్తాం. రూ.2 లక్షల రుణం తీసుకుని ప్రతి రైతు ఇవాళే పోయి పైసలు తెచ్చుకోండి..” అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు రైతులను రెచ్చగొట్టాడు. రూ.2 లక్షల రుణమాఫీ అంటూ బీరాలు పలికారు. డిసెంబర్లో చేస్తామన్న రుణమాఫీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా కార్యరూపం దాల్చలేదు. ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తున్న తరుణంలో చివరకు విడుతలవారీగా చేస్తామంటూ ప్రకటించారు. రూ.ఒక లక్ష వరకు రుణాలు తీసుకున్న వారికే తొలి విడుత మాఫీ అన్నారు. పోనీలే రూ.లక్ష వరకైనా మాఫీ చేస్తున్నారనుకుంటే దానికి సవాలక్ష కొర్రీలు పెట్టడంతో రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తున్నది. రాష్ట్రంలో రూ. ఒక లక్ష వరకు రుణాలు తీసుకున్న రైతులు లక్షల మంది తొలి విడుతలో రుణమాఫీ కాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే సరికి రూ.లక్ష రుణాలు తీసుకున్న రైతుల్లో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదని గణాంకాలు, క్షేత్రస్థాయిలోని పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అసలు రుణమాఫీకి ఏం ప్రాతిపాదికగా తీసుకున్నారు. లక్షలోపు రుణాలు ఉన్న వారికి ఎందుకు మాఫీ చేయలేదు. ఇలాంటి అనేక ప్రశ్నలకు స్పష్టత కొరవడింది. బ్యాంకుల్లోనైతే పంట రుణాలు తీసుకున్న రైతుల జాబితాలే తమ దగ్గర లేవని అధికారులు చెప్తున్నారు. రూ.లక్షలోపు రుణం మీ బ్యాంక్‌లో ఎంత మందికి ఇచ్చారు. వారిలో తొలి విడుతలో ఎంత మందికి మాఫీ అయ్యిదంటే మా దగ్గర ఆ జాబితా లేదంటూ చేతులు ఎత్తేస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులైనా చెప్తున్నారా అంటే అదీ లేదు. ఇటు వ్యవసాయ అధికారులు, అటు లీడ్ బ్యాంక్ అధికారులు మాకేం తెలియదంటే మాకేం తెలియదని తప్పించుకుంటున్నారు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన జాబితాలో ఉన్న వారికి మాత్రమే మాఫీ చేస్తున్నామని చెప్తున్నారు. దీంతో రూ.లక్షలోపు రుణం తీసుకుని, అన్ని రకాల అర్హులుగా ఉన్నప్పటికీ రుణమాఫీ ఎందుకు కాలేదో స్పష్టత లేక రైతులు అయోమయంలో పడిపోతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు రుణాలు ఇవ్వడంలో కీలకభూమిక పోషించే డీసీసీబీ(జిల్లా కేంద్ర సహకార బ్యాంక్), పీఏసీఎస్ సొసైటీల్లో రుణాలు తీసుకున్న చాలా మంది రుణాలు మాఫీ కాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే తీసుకుంటే డీసీసీబీల నుంచి నేరుగా 1,646 మంది, పీఏసీఎస్ సొసైటీల నుంచి 33,914 మంది రైతులు మొత్తం 35,560 మంది రూ.లక్ష వరకు రుణాలు తీసుకున్నారు. వడ్డితో కలుపుకుని రూ.183.21 కోట్లు రుణం తీసుకున్నారు. కాగా.. తొలి విడుతలో వీరిలో 12,477 మంది రైతులకు సంబంధించిన రూ.63.25 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. అంటే రైతులు తీసుకున్న మొత్తం రుణంలో 34.52 శాతం, రైతుల్లో 35 శాతం మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. మిగిలిన 65 శాతం మందికి ఎందుకు రాలేదు అనేదానిపై స్పష్టత లేకుండా పోయింది.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్ సొసైటీలో 418 మంది రైతులు రూ.లక్ష లోపు రుణం తీసుకోగా, వీరిలో 127 మంది రైతులకు రుణమాఫీ అయ్యింది. చెన్నూర్ సొసైటీలో 448 మందికి 80 మందికి, తాండూర్‌లో 190 మందికి 42, లక్షెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ సొసైటీలో 297 మందికి 84, బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి సొసైటీలో 749 మందికి 249, కాసిపేట మండలం ధర్మారావుపేట సొసైటీలో 317 మందికి 172, భీమిని సొసైటీలో 396 మందికి 40, జైపూర్ సొసైటీలో 194 మందికి 40, గుళ్లకోట సొసైటీలో 559 మందికి ఏ ఒక్కరికీ రుణమాఫీ కాలేదు. నెన్నెల సొసైటీలో 197 మందికి 13, జన్నారం మండలం పొనకల్ సొసైటీలో 263 మందికి 87, వేమనపల్లి సొసైటీలో 530 మందికి 385 మంది రైతులకే రూ.లక్ష లోపు రుణాలు మాఫీ అయ్యాయి.
నిర్మల్ జిల్లా భైంసా సొసైటీ పరిధిలో 742 మంది రైతు ల్లో 307 మందికే రుణమాఫీ అయ్యింది. దిలావర్పూర్ మండలం బన్సపల్లి సొసైటీలో 193 మందికి, మంజులాపూర్ సొసైటీలో 801 మందికి 150, కుంటాల సొసైటీలో 550 మందికి 114, కడెం సొసైటీలో 981 మం దికి 489 మందికే లక్ష లోపు ఉన్న రుణాలు మాఫీ అయ్యాయి. l ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల సొసైటీలో 600 మందికి 349, తిర్యాణి సొసైటీలో 538 మందికి 462, సిర్పూర్(టీ) సొసైటీలో 824 మందికి 388 మందికే లక్షలోపు రుణాలు మాఫీ అయ్యాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ సొసైటీ తీసుకున్నా లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులందరి మాఫీ కాలే దు. ఇతర బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీనిపై డీసీసీబీలో పని చేసే ఓ ఉన్నతాధికారిని వివరణ కోర గా.. ఇతర బ్యాంకుల్లోనూ రుణం ఉన్న రైతులకు ఇక్క డ మాఫీ కాలేదు అని చెప్పారు. అలాంటి వారు సొసైటీల్లో ఎంత మంది ఉన్నారు. వాళ్లని మినహాయిస్తే అర్హులైన మిగిలిన వారికి ఎందుకు రుణాలు ఇవ్వలేదు అని అడిగితే మాత్రం ఆయన తమకు స్పష్టత లేదంటూ చె ప్పుకొచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇస్తే తప్పా లక్ష రూపాయల లోపు రుణం తీసుకుని, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రుణం మాఫీ ఎందుకు కాలేదో రైతులకు తెలిసే పరిస్థితి కనిపించడం లేదు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : మా ఊరిలో ఉన్న వ్యవసాయ భూమి మీద జైనూర్ బ్యాంకులో రూ. 65 వేల రుణం తీసుకున్న. రుణమాఫీ లిస్టులో నా పేరు రాలే. బ్యాంకుకు వెళ్లి అడిగితే సార్లు మాకు తెల్వదంటున్నరు. ఎంతో ఆశపడ్డ. ఇలా అవుతుందనుకోలే. ఇకనైనా సార్లు నాకు న్యాయం చేయాలె.
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : మాకున్న భూమిపై వాంకిడి స్టేట్‌బ్యాంకులో రూ. లక్ష పంట రుణం తీసుకున్న. సర్కారు గురువారం ప్రకటించిన జాబితాలో నాకు రుణమాఫీ కాలేదు. సార్లను అడిగితే తెలుసుకొని చెబుతమంటున్నరు. కాంగ్రెసోళ్లు పంటరుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఆశపెట్టి నీళ్లు చల్లిన్రు. ఇప్పటికైనా పంటరుణం మాఫీ అయ్యేలా చూడాలి.
