పత్తి కొనుగోళ్లపై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( సీసీఐ) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. రైతులకు అండగా నిలవాల్సిన ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ, వారి కష్టాన్ని పట్టించుకోకపోవడం తీవ్ర దుమారం రేపుతున్నది. జిల్లాలో నామ్‌కే వాస్తేగా వాణిజ్య కొనుగోళ్లను ప్రారంభించినా, ఈ సీజన్లో కిలో పత్తి కూడా సేకరించలేదు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తున్నది. సంస్థ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా, పట్టనట్లు వ్యవహరించడం వారి ఆగ్రహానికి కారణమవుతున్నది. ఇటీవలే అఖిలపక్ష రైతు సమన్వయ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన చేపట్టింది.
ఆదిలాబాద్,జనవరి 14 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3.52 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి సాగుచేయగా 26 లక్షల క్వింటాళ్ల పంట మార్కెట్‌కు వస్తుందని అధికారులు అంచనా వేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లు దాదాపు మూడు నెలులు కావస్తుంది. ఈ ఏడాది క్వింటాలుకు మద్దతు ధర రూ.6380 ఉండగా, సీజన్ ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో క్వింటాకు రూ. 8500 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 3.96 లక్షల క్విం టాళ్ల పత్తి విక్రయాలు జరుగగా, ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో 2,81,493 క్వింటాళ్లు, బోథ్ మార్కెట్‌యార్డులో 20,292 క్వింటాళ్లు, ఇంద్రవెల్లిలో 17,297 క్వింటాళ్లు, ఇచ్చోడలో 13,352 క్వింటాళ్లు, జైనథ్ మార్కెట్‌యార్డులో 4,490 క్వింటాళ్ల పత్తి విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోల్చితే పంట అమ్మకాలు నెమ్మదిగా జరుగుతున్నాయి. ధర పెరుగుతందనే ధీమాతో రైతులు పంటను మార్కెట్‌యార్డులకు తీసుకురావడం లేదు. కొంతమంది రైతులు మహారాష్ట్రకు తీసుకెళ్లి పత్తి విక్రయిస్తున్నారు.
జిల్లాలో రైతుల నుంచి పత్తి కొనుగోళ్లు చేసి వారు నష్టపోకుండా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ (సీసీఐ) పంట కొనుగోళ్లలో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తుంది. సీసీఐ రెండు విధాలుగా పత్తి కొనుగోళ్లు చేస్తుంది. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో జిల్లాలోని అన్ని మార్కెట్‌యార్డుల్లో పంటను సేకరిస్తుంది. రెండో విధానంలో భాగంగా మద్దతు ధరతో సంబంధం లేకుండా ప్రైవేట్ వ్యాపారులతో పోటీపడి రైతులకు లాభం వచ్చేలా వారికి కంటే ఎక్కువ ధర చెల్లించి వాణిజ్య కొనుగోళ్లు జరుపుతున్నది. రెండు నెలల కిందట ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులో కమర్షియల్ కొనుగోళ్లను ప్రారంభించిన సీసీఐ ఇప్పటి వరకు రైతుల నుంచి పంట సేకరించలేదు. కమర్షియల్ కొనుగోళ్లను ప్రారంభించిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ వ్యాపారుల కంటే తక్కువ ధరను ప్రకటిస్తున్నది. దీంతో రైతులు సీసీఐకి పత్తిని విక్రయించడం లేదు. పంట కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ తీరుపై రైతులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఆదుకోవాల్సిన సీసీఐ పంటకు తక్కువ ధర చెల్లించడంపై విస్మ యం చెందుతున్నారు. పత్తి కొనుగోళ్లలో సీసీఐ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ అఖిల పక్ష రైతు సమన్వయ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న అధికారులు స్పందించడం లేదు. వాణి జ్య కొనుగోళ్లను ప్రారంభించిన సీసీఐ ప్రైవేటు వ్యాపారుల కంటే ఎక్కువ ధర చెల్లించాలని రైతులు కోరుతున్నారు.