తాండూర్ : వివిధ భూ సమస్యలపై భూభారతి ( Bhubharathi ) రెవెన్యూ సదస్సులలో ప్రజలు అందించిన దరఖాస్తుల పరిష్కారం ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సకడ్బందీగా చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ( Collector Kumar Deepak ) అన్నారు. గురువారం తాండూర్ తహసీల్ కార్యాలయాన్ని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి సందర్శించి భూ భారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ రకాల భూ సమస్యలపై అర్జీదారులు అందించిన దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం దిశగా పకడ్బందీగా చేపట్టాలని తహసీల్దార్ జ్యోత్స్న, రెవెన్యూ సిబ్బందికి సూచించారు. వివిధ పనుల నిమిత్తం ఆయా కార్యాలయాలకు వచ్చిన ప్రజలతో మాట్లాడి వారు వచ్చిన కారణాలను తెలుసుకొని దరఖాస్తులను త్వరగా పరిష్కరించే విధంగా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.