నార్నూర్ : మహారాష్ట్ర సరిహద్దు ( Borders ) ప్రాంతాలలో అక్రమ రవాణాలను అరికట్టాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Akhil Mahajan ) పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని గాదిగూడ మండలంలో లోకారి చెక్పోస్ట్ ను శనివారం పరిశీలించారు. గాదిగూడ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. మారేగావ్, హీరాపూర్, పరుసువాడ, గౌరీ, కొలామా గ్రామాలను సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. చెక్ పోస్ట్ వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి వాహనాన్ని పరిశీలించాలని సూచించారు. పశువులు తరలకుండా పర్యవేక్షించాలన్నారు. సరైన పత్రాలు లేకుండా పశువుల తరలింపునకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విధులలో నిజాయితీ, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు. మహారాష్ట్ర సరిహద్దు గుండా పశువులు, రాయితీ బియ్యం, గుడుంబా, గంజాయి తరలకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మాదకద్రవ్యాల నిర్మూలన, అనర్థాలపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. గాదిగూడ ప్రాంత యువత, విద్యార్థులకు గ్రంథాలయ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పెన్నులు, వాలీబాల్ కిట్స్ లను పంపిణీ చేశారు. త్వరలోనే అగ్ని వీర్ నియామకాల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి, నార్నూర్ సీఐ అంజమ్మ, గాదిగూడ ఎస్సై రమ్య, సర్పంచ్ రాథోడ్ స్వాతి జగన్, మాజీ ఎంపీపీ రాథోడ్ గోవింద్ నాయక్, రాజు పటేల్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.