బెల్లంపల్లి, ఫిబ్రవరి 21 : బెల్లంపల్లి ఎమ్మెల్యేను నేనే.. భూ కబ్జాలు చేసినా ఏ అధికారీ నన్ను అడ్డుకోలేరని మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కారుకూరి రాంచందర్ బెదిరిస్తున్నట్లు సోమగూడెం (బీ) సర్పంచ్ కొరికొప్పుల ప్రమీలా గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లంపల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీటీసీ చుంచు మల్లమ్మతో కలిసి ఆమె మాట్లాడారు.
బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి శివారు సోమగూడెం జాతీయ రహదారిని ఆనుకొని ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి తన అనుచరుడు ముత్తె భూమయ్యతో కలిసి విక్రయిస్తున్నాడని ఆరోపించారు. గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి అనుమతులు లేవని, ఆ స్ధలం అమ్మవద్దు, కొనవద్దని రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులు సైతం తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు పంచాయతీ కార్యదర్శిపై కూడా బెదిరింపులకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు.
గతంలో ఈ స్థలాన్ని శ్మశాన వాటిక, డంప్ యార్డుకు ప్రభుత్వం కేటాయించగా, అక్కడి ప్రజల వ్యతిరేకత మేరకు మరో చోట ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు ఆ స్థలాన్ని రాంచందర్ తన అనుచరులతో కలిసి కబ్జా చేసి, ప్లాట్లుగా మారుస్తున్నాడని ఆరోపించారు.
ఈ విషయాన్ని కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా, చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ అండదండలతోనే భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే స్పందించి భూకబ్జాలకు అడ్డుకట్టవేయడానికి సంబంధిత అధికారులను ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఆక్రమిత భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇల్లు లేని పేదలకు కేటాయించాలని కోరారు. నాయకులు చుంచు లింగయ్య, చుంచు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.