మంచిర్యాల, జూలై 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సంక్షేమ హాస్టళ్లకు విజయ పాలు సరఫరా చేసే ఏజెన్సీలు కోట్ల రూపాయాలు లూటీ చేస్తున్నాయి. మార్కెట్లో లీటర్ ధర రూ.60 ఉంటే, సంక్షేమ హాస్టళ్లకు రూ.62 చొప్పున సరఫరా చేస్తూ విజయ డెయిరీ గుర్తింపు పొందిన ఏజెన్సీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏటా కోట్ల రూపాయాల సర్కారు సొమ్మును స్వాహా చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఇటీవల ఈ వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన కలెక్టర్ కుమార్ దీపక్ రూ.60లకే లీటర్ చొప్పున పాలు సరఫరా చేయాలని విజయ డెయిరీ అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాలలో రూ.60కి సరఫరా చేస్తుంటే పక్కనున్న ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలతోపాటు ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో నడిచే సంక్షేమ హాస్టళ్లలో మాత్రం ఇప్పటికీ లీటర్‌కు రూ.62 చొప్పున సరఫరా చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల జిల్లా కలెక్టర్‌కు కనిపించిన అక్రమాలు, మిగిలిన జిల్లాల కలెక్టర్లకు ఎందుకు కనిపించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లకు గడిచిన ఆరేళ్లుగా విజయ పాలు సరఫరా అవుతున్నాయి. పాలను సరఫరా చేస్తున్న మూడు ఏజెన్సీలు గడిచిన ఆరేండ్లుగా ఎంఆర్పీపై రూ.2 అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఆదిలాబాద్‌లో ఉండే ఓ ఏజెన్సీ ఆదిలాబాద్‌తోపాటు పెద్దపల్లికి, నిర్మల్ జిల్లాలో ఉండే ఏజెన్సీ నిర్మల్‌తోపాటు జగిత్యాలకు, మంచిర్యాల జిల్లాలో ఉండే ఏజెన్సీ మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాకు పాలు సరఫరా చేస్తున్నాయి. ఆరేండ్లుగా లీటరుకు ఎంఆర్పీపై రూ.2 అదనంగా వసూలు చేస్తున్నట్లు ఏజెన్సీల నిర్వాహకులే చెప్తున్నారు. మంచిర్యాల జిల్లాను ఉదాహరణగా తీసుకుంటే.. జిల్లాలో 44 సంక్షేమ హాస్టళ్లకు విజయ పాలు సరఫరా చేస్తున్నారు.
44 హాస్టళ్లకు ప్రతి నెల 30 వేల లీటర్ల నుంచి 35 వేల లీటర్ల పాలు పోస్తున్నట్లు విజయ డెయిరీ అధికారులు వెల్లడించిన అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. ప్రతి నెల సగటున 30 వేల లీటర్లు అనుకున్నా.. లీటర్‌పై రూ.2 అదనంగా వేసుకుంటే రూ.60 వేలు అవుతున్నాయి. 11 నెలలు హాస్టళ్లు నడిస్తే రూ.6.60 లక్షలు అవుతుంది. ఇది ఒక మంచిర్యాల జిల్లాలోనే.. ఇదే తరహాలో నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోనూ సగటున ఒక్కో జిల్లాకు నెలకు 30 వేల లీటర్ల నుంచి 35 వేల లీటర్ల పాల చొప్పున లెక్క వేసుకున్నా ఏడాదికి రూ.40 లక్షల నుంచి రూ.70 లక్షలు అవుతున్నది. అదే ఆరేండ్ల కాలానికి రూ.2.50 కోట్ల నుంచి రూ.5 కోట్లు ఏజెన్సీల జేబుల్లోకి వెళ్తున్నాయి.
రవాణా చార్జీలు, కమిషన్ కలుపుకుని ఎంఆర్పీ రూ.60 వాస్తవానికి విజయ డెయిరీ డిస్ట్రిబ్యూటర్లకు లీటర్ పాలను రూ.53కే సరఫరా చేసింది. ఎంఆర్పీ రూ.60లో రూ.2 రవాణా చార్జీలు, మిగిలిన రూ.5 డిస్ట్రిబ్యూటర్‌కు కమిషన్ కింద ఇస్తారు. అంటే నిబంధనల ప్రకారం ఎంఆర్పీకి మించి పాలు విక్రయించడానికి లేదు. కానీ హైదరాబాద్ నుంచి పాలు వేరే ప్రాంతానికి తీసుకువెళ్లాల్సి వస్తే ఎంఆర్పీపై అదనంగా రూ.2 తీసుకోవచ్చని విజయ డెయిరీ ఉన్నతాధికారులు తెలిపారు. గతంలో మంచిర్యాల జిల్లాకు విజయ డెయిరీ బీఎంసీ యూనిట్ లేనప్పుడు నిజామాబాద్ నుంచి పాలు సరఫరా చేశారు. ఆ సమయంలో రూ.2 అదనంగా తీసుకున్నారు. కానీ.. జిల్లాలోని లక్షెట్టిపేటలో 2016లోనే బీఎంసీ యూనిట్ ఏర్పాటైంది. నిత్యం 4వేల లీటర్ల పాలు ఇక్కడి నుంచి వస్తున్నాయి. ప్రస్తుతం మంచిర్యాలలోని హాస్టళ్లకు డిస్ట్రిబ్యూటర్ సరఫరా చేసే పాలు ఇక్కడి నుంచే వస్తున్నాయి.
అలాంటప్పుడు రూ.2 రవాణా చార్జీలు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. పాత పద్ధతిలోనే కొన్నేళ్లుగా లీటర్ పాలపై రూ.2 అదనపు దోపిడీకి పాల్పడుతుండడం గమనార్హం. మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఈ అంశాన్ని గుర్తించే లీటర్ రూ.60కే ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మంచిర్యాల మాదిరి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోనూ విజయ డెయిరీకి సొంత యూనిట్లు ఉన్నాయి. వేరే జిల్లాల నుంచి పాలు రావడం లేదు. అలాంటప్పుడు మంచిర్యాల జిల్లా మాదిరి ఆ జిల్లాల్లోనూ రూ.60కే లీటర్ పాలు పోయాలి. డెయిరీ అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్లకు చెప్పకుండా రవాణా చార్జీల పేరిట ఏజెన్సీలకు ప్రతి లీటర్‌పై రూ.2 అదనంగా చెల్లించేలా ఆదేశాలు ఇప్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు చాలా జిల్లాల్లో సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేస్తున్న విజయ డెయిరీ పాలపై రవాణా చార్జీల పేరిట అదనంగా బిల్లులు తీసుకుంటున్నారు. వేరే జిల్లా నుంచి సరఫరా చేయాల్సి వచ్చినప్పుడు ఇలా అదనంగా రవాణా చార్జీలు వసూలు చేసుకోవచ్చని చెప్తున్నారు. సొంత జిల్లాలోనే బీఎంసీ యూనిట్లు ఉంటే ఎంఆర్పీపై అదనంగా చార్జి చేయడానికి లేదు. అది నిబంధనలకు పూర్తి విరుద్ధమని డైయిరీ ఉన్నతాధికారులు చెప్తున్నారు. మంచిర్యాల కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు సమర్థిస్తున్నారు.
కాగా ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలతో కొన్ని సంక్షేమ హాస్టళ్లకు మాత్రమే లీటర్ రూ.60 ఇస్తున్నారు. భీమారం మండలాన్నే తీసుకుంటే కలెక్టర్ ఆదేశాలతో స్థానిక ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్‌కు లీటర్ పాలను రూ.60కే ఇస్తున్నారు. అదే మండలంలో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలకు మాత్రం రూ.62 చొప్పున లీటర్ పాలు ఇస్తున్నారు. ఇక్కడ రూ.60కే లీటర్ పాలు ఇవ్వాలంటే ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఆదేశాలివ్వాలి. దీంతో కొన్ని హాస్టళ్లకు రూ.60కే లీటర్ పాలు వస్తుంటే, మరికొన్ని హాస్టళ్లకు లీటర్ రూ.62కు పోస్తున్నారు.
ఎంఆర్పీపై అక్రమంగా మిగుల్చుకునే డబ్బులతోపాటు సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేయాల్సిన పాలను రెండు రకాలుగా పక్కదారి పట్టిస్తున్నారు. విజయ డెయిరీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. విజయ డెయిరీ పాలకు మంచిర్యాల జిల్లాలో సివిల్ మార్కెట్ లేదు. అంటే సంక్షేమ హాస్టళ్లకు తప్ప బహిరంగ మార్కెట్లో పాల సరఫరా లేదని అధికారికంగా చెప్తున్నారు. కొన్ని షాపుల్లో విజయ పాలను విక్రయిస్తున్నారు. మంచిర్యాలలోని కొన్ని ప్రముఖ హోటళ్లలో విజయ పాలను వినియోగిస్తున్నారు. సివిల్ మార్కెట్ లేకుండా ఈ పాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే.. సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేయాల్సిన పాలే బయటికి వెళ్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఒక హాస్టల్‌కు రోజూ 100 లీటర్ల పాలు సరఫరా చేయాల్సి ఉంటే 50 లీటర్లు సరఫరా చేసి, మిగిలిన 50 లీటర్లు మార్కెట్లో అమ్మేస్తున్నారనే విమర్శలున్నాయి.
హాస్టళ్లలో ఎంత మంది విద్యార్థులున్నారు. పాల అవసరం ఎంత ఉంది. ఎన్ని లీటర్ల పాలు పోస్తున్నారు. ఈ వివరాలేవీ సంక్షేమ హాస్టళ్ల అధికారులు వెల్లడించడం లేదు. ఈ లెక్కలు అడిగితే ఈ సమాచారం ఇవ్వడానికి లేదంటూ దాట వేసే ధోరణిలో సమాధానాలు ఇస్తుండడంపై అనుమానాలు రేకెత్తున్నాయి. మరోవైపు సంక్షేమ హాస్టళ్లకు ఇవ్వాల్సిన పాలు ఇలా బయట అమ్ముకుంటామని, ఇందుకు గాను కొందరు అధికారులను నెలనెల మామూళ్లు ఇస్తామని ఏజెన్సీల నిర్వాహకులే బయట మాట్లాడుతుండడం గమనార్హం.
ఎంఆర్పీపై రూ.2 అదనంగా బాదడంతోపాటు హాస్టళ్లలో పోయాల్సిన పాలు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తే వచ్చే ఆదాయం మొత్తం కలిపితే కొన్ని కోట్ల రూపాయలు అవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. పక్కదారి పట్టిన కోట్ల రూపాయాలను రికవరీ చేయాలి. అధిక ధరలకు పాలు పోసి సొమ్ము చేసుకుంటున్న ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి. అధికారులు ఇవేవీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
సంక్షేమ హాస్టళ్లకు ఎంఆర్పీ కంటే అధిక ధరకు పాలు పోయడంపై మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సీరియస్ అయ్యారు. రూ.60కే లీటర్ పాలు పోయాల్సిందే అంటూ ఆయన స్పష్టం చేశారు. విజయ డెయిరీ సూచించిన ఏజెన్సీలు ఎంఆర్పీకి పాలు పోయలేని పక్షంలో మహిళ సంఘాలకు ఆ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ఇదే విషయంపై మంత్రి సీతక్క, విజయ డెయిరీ చైర్మన్సహా ఉన్నతాధికారులతో చర్చించినట్లు తెలిసింది. పైలెట్ ప్రాజెక్ట్‌గా ములుగు, భూపాలపల్లి జిల్లాలో చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మంచిర్యాల జిల్లాలో అదే తరహా చేయాలనే ఆలోచనకు అధికారులు వచ్చినట్లు తెలిసింది. అదే జరిగితే మంచిర్యాల జిల్లాలోని మహిళ స్వయం సహాయక సంఘాలకు మంచి రోజులు రానున్నాయి.