కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) ;సమైక్య రాష్ట్రంలో చీకట్లో మగ్గిన చిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తున్నాయి. కనీస గుర్తింపు లేక, శ్రమకు తగ్గ ఫలితం దక్కక అష్టకష్టాలు పడిన వారి బతుకులు స్వరాష్ట్రంలో మారుతున్నాయి. తెలంగాణ ఏర్పడి టీ(బీ)ఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నరేళ్లలో ఆయా ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగాయి. అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు, గ్రామ సేవకులు, విద్యావలంటీర్లు, కాంట్రాక్టు లెక్చరర్లు, వీవోఏలు.. ఇలా గ్రామస్థాయి ఉద్యోగుల జీతాలు దశలవారీగా పెంచుతుండగా, సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ‘గౌరవ’ంగా బతికేలా హోదా కల్పించిన సీఎం కేసీఆర్కు ఆయా వర్గాలు దీవెనలు అందిస్తున్నాయి.
తెలంగాణ ఏర్పడి.. టీ(బీ)ఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగులకు అండగా నిలుస్తున్నది. గ్రామస్థాయిలో పనిచేసే చిరుద్యోగులైన ఆశ కార్యకర్తలు, అంగన్వాడీలు, హోంగార్డులు, వీఆర్వోలులు, 108 సిబ్బంది, విద్యుత్ శాఖ చిరుద్యోగులు, విద్యావలంటీర్లు, వీవోఏలు, కాంట్రాక్టు లెక్చరర్లు ఇలా అన్ని వర్గాల శ్రమను గుర్తించి దశలవారీగా వేతనాలు పెంచుతున్నది. సమైక్య పాలనలో వేతనాల కోసం ఎదురుచూసిన చిరుద్యోగులు.. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణలో తాము అడుగక ముందే ఊహించిన దానికన్నా ఎక్కువ వేతనాలు అందుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఆయా శాఖల్లో పనిచేసే సుమారు 4,014 మందికి భారీగా వేతనాలు పెరిగాయి.
అంగన్వాడీలకు అండగా..
ఉమ్మడి రాష్ట్రంలో అంగన్వాడీల ఆకలికేకలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. శ్రమకు తగిన వేతనం ఏనాడూ ఇవ్వలేదు. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదన్నరేళ్లలో మూడుసార్లు జీతాలు పెంచడంతో పాటు వారి హోదాను అంగన్వాడీ కార్యకర్తల నుంచి అంగన్వాడీ టీచర్ల స్థాయికి పెంచింది. సమైక్యరాష్ట్రంలో రూ. 2 వేల జీతం ఉండగా, ప్రస్తుతం రూ. 12 వేలు అందుకుంటున్నారు. ఇక ఆయాలు రూ. 8 వేలు తీసుకుంటున్నారు. జిల్లాలో 767 మంది అంగన్వాడీలు, 767 మంది ఆయాలు, 86 మంది మినీ అంగన్వాడీలకు ప్రయోజనం కలిగింది.
గ్రామ సేవకులకు గౌరవం
రెవెన్యూసేవలు అందించే గ్రామసేవకులకు ప్రభుత్వం గౌరవ ప్రదమైన వేతనాలు పెంచి వారి హోదానుమార్చింది. చాలీచాలని వేతనాలతో ఏళ్లకేళ్లు ఇబ్బందులు పడ్డ వారికి ఒకేసారి రూ. 6,600 నుంచి రూ. 10,500లకు పెంచేసింది. ఈ లెక్కన జిల్లాలో 320 మందికి ప్రయోజనం కలిగింది. ఇటీవలి కాలంలో వీరిని వివిధ శాఖల్లో పర్మినెంట్ చేసింది. గ్రామ సేవకుల వేతనాలు రూ. 15 వేల నుంచి 18 వేలకు పెరిగాయి.
వీవోఏల వేతనాల పెంపు
గ్రామాల్లో మహిళా స్వశక్తి సంఘాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వీవోఏ)లకు ఇప్పటికే రెండుసార్లు వేతనాలు పెంచారు. ప్రస్తుతం రూ. 6,900ల జీతం ఉండగా, రూ. 1,100కు పెంచి.. రూ. 8వేలు చేశారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 397 మంది వీవోఏలకు ప్రయోజనం కలుగనున్నది.
తీరిన కాంట్రాక్టు లెక్చరర్ల కష్టాలు..
కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న కాంట్రాక్టు లెక్చరర్ల కన్నీళ్లను టీఆర్ఎస్ ప్రభుత్వం తుడిచింది. ప్రభుత్వ లెక్చరర్లతో సమానంగా గుర్తింపునిచ్చింది. రూ. 18 వేల నుంచి రూ.38 వేలకు జీతం పెంచడమేగాక రెగ్యులర్ చేసింది. దీంతో వీరి వేతనాలు రూ.65 వేలకు చేరాయి. గతంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఒకేసారి ఇంత మొత్తంలో వేతనాలు పెంచింది లేదు. పైగా రెగ్యులరైజ్ చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. జిల్లాలో 11 జూనియర్ కళాశాలల్లో 120 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు.
రెట్టింపైన వీవీల వేతనాలు
మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ విద్యాబుద్ధులు నేర్పించే విద్యావలంటీర్ల వేతనాలను తెలంగాణ ప్రభుత్వం రెట్టింపు చేసింది. రూ. 6 వేల నుంచి రూ. 8 వేల వరకు ఉన్న వేతనాలను రూ. 12 వేలకు పెంచేసింది. జిల్లాలో 754 మంది విద్యావలంటీర్లకు ప్రయోజనం చేకూరుతున్నది.
‘ఆశ’ల జీవితాల్లో వెలుగులు
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆశ కార్యర్తల జీవితాల్లో వెలుగుల నిండాయి. ఆశ కార్యకర్తల వేతనాలను రూ. 400 నుంచి ఏకంగా రూ. 6 వేలకు పెంచేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏళ్ల తరబడి వేతనాల పెంపుకోసం ఎదురుచూస్తున్న ఆశ కార్యర్తల దశాబ్దాల కలను సర్కారు నెరవేర్చింది. విధుల్లోనూ మార్పులు చేసింది. శిక్షణ ఇచ్చి గుర్తింపు కార్డులు, యూనిఫాంలు అందించింది. జిల్లాల్లో 802 మంది ఆశ కార్యకర్తలకు ప్రయోజనం కలుగుతోంది.