కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ/కెరమెరి/సిర్పూర్(యూ)/ బెజ్జూర్, మార్చి 13 : హోలీ, కామ దహన వేడుకలను ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు తమ ఆచారాల ప్రకారం నిర్వహిస్తూ ప్రత్యేకతలను చాటుకుంటున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ఆదివాసీ గ్రామాల్లో కామదహన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కామ దహనానికి ముందే గిరిజన గ్రామాల్లోని ప్రతి ఇంటి నుంచి ఒక్కో కుడుకను సేకరించి గ్రామ పటేల్ ఇంటికి తీసుకువస్తారు. ఒకవేళ కుడుకను ఎవరైనా ఇవ్వకపోతే తమ ఆచార వ్యవహారాలను ధిక్కరించినట్లుగా భావించి ఆకుటుంబాన్ని సంఘ బహిష్కరణ చేస్తారు.
అడవికి వెళ్లి వెదురు బొంగులు తెచ్చి…
కామదహనం రోజు ఉదయం నుంచే మాతరి, మాతర ప్రతీకలుగా రెండు వెదురు బొంగులకు అలంకరణ చేస్తారు. గ్రామస్తులందరి వద్ద నుంచి సేకరించిన కుడుకలతో దండలు తయారు చేసి వాటికి తగిలిస్తారు. కామ దహనం రోజు సాయంత్రం ఊరేగించి గ్రామం బయటకు తీసుకువచ్చి దహనం చేస్తారు. 15 రోజులుగా పిల్లలు ఆడుకుంటున్న కోలలనువేసి మంటల్లో వేస్తారు. అనంతరం వాటి చుట్టూ సాంప్రదాయ నృత్యాలు చేస్తారు. మంటల్లో మాతరి, మాతరల పేర్లతో ఉన్న వెదురు కర్రలు కింద పడిపోకుండా చూస్తారు. వాటికి కట్టిన కుడకలను చిన్న ముక్కలుగా చేసి గ్రామంలో అందరూ పంచుకుంటారు. హోలీ రోజు ఉదయం బూడిదను తీసుకెళ్లి ఇంటింటికీ పంచుతారు. హోలీ రంగుల్లో ఈ బూడిదను కలిపి సంబురాలు నిర్వహిస్తారు. కుడుకలు, బూడిద ఇంట్లో నిల్వ చేసి అనారోగ్యం కలిగినా, గాలి, నీడ సోకినా ఈ బూడిద బొట్టు పెట్టి నీళ్లలో కలిపి తాగిస్తుంటారు.
అడవికి అందాలు తెచ్చిన గోగుపూలు
హోలీ పండుగకు ముందు అడవిలో, వాగులు, రోడ్లకు ఇరువైపులా ఎర్రగా విరబూసే గోగుపూలు (మోదుగ పూలు)తో తయారు చేసిన రంగులను హోలీ పండుగలో చల్లుకోవడం ఆదివాసీల్లో ఆనవాయితీగా వస్తున్నది. వీటితో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని తెలిపారు. రసాయన రంగులతో చర్మ సమస్యలు తలెత్తుతాయని గ్రామాల్లో పెద్దలు సూచిస్తున్నారు.
పిల్లలకోసం చక్కర బిళ్లల పేర్లు..
హోలీ పండుగ వచ్చిందంటే మార్కెట్లో చక్కర బిళ్లల పేర్లు కనిపిస్తాయి. హోలీ పండుగ రోజు చిన్నపిల్లల మెడలో వేయడం అనవాయితీగా వస్తున్నది.