ఆదిలాబాద్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. సీజన్ ప్రారంభం నుంచి భానుడు ప్రతాపం చూపుతుండగా.. శనివారం సీజన్లోనే అధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఎండ తీవ్రత సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతున్నది. మండుతున్న ఎండల కారణంగా ప్రధాన రహదారులు, వీధులు జన సంచారం లేక కనిపిస్తున్నాయి.
గొడుగులు వాడుతూ క్యాప్‌లు, తలకు కర్చీఫ్‌లు ధరిస్తున్నారు. కొబ్బరి బొండాలు, చల్లటి పానీయాలు సేవిస్తున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి ఇండ్లలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను వినియోగిస్తున్నారు. జిల్లాలో ఎండల ప్రభావం ఎక్కువగా ఉన్నందునా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.