మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ముంచెత్తుతున్నది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండగా, గేట్లు ఎత్తి దిగువకు వదులుతుండగా, వాగులు.. వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై పంటలు, కాలనీలు నీట మునిగాయి. ఇండ్లు కూలిపోయాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలోకి వరద చేరగా, రోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రాణహిత నదిలో 25 పడవలు కొట్టుకుపోతుండగా, మత్స్యకారులు అప్రమత్తమై మరపడవల సాయంతో వాటిని ఒడ్డుకు చేర్చారు. సాంఘి వాగులో 200 పశువులు కొట్టుకుపోగా, ఇందులో 150 పశువులు ఒడ్డుకు చేరాయి.

నమస్తే నెట్వర్క్, జూలై 30 : మంచిర్యాల జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తున్నది. మంచిర్యాల సమీపంలోని క్వారీ వంతెన ప్రమాదపుటంచుల్లో పడింది. గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాళ్లవాగు ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తున్నది. మంచిర్యాలలోని పలు కాలనీల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాంచెరువు, తిలక్‌నగర్ చెరువు, పోచమ్మ చెరువులలోకి చేరిన వరద మత్తడి దుంకి ప్రవహిస్తున్నది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. క్వారీ వంతెన ప్రమాదపుటంచుల్లో పడింది. రాళ్లవాగు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రవహిస్తోంది.
మంచిర్యాలలోని ఏసీసీ నుంచి డీమార్ట్ మీదుగా క్వారీ వైపునకు వెళ్లేందుకు మధ్యలో రాళ్లవాగుపై చాలా ఏళ్లక్రితం వంతెనను నిర్మించారు. ప్రస్తుతం దానికి ఆనుకుని ఉన్న రోడ్డుకు వరద తీవ్రతతో బుంగపడింది. రాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. పోలీసులు క్వారీ రోడ్డుపై రాకపోకలను నిలిపివేశారు. దీంతో క్వారీకి అవతల ఉన్న హాజీపూర్ మండలంలోని తొమ్మిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీలో ఓ భారీ వృక్షం నేలకూలి ఇంటి పకన నిలిపి ఉంచిన కారుపై పడింది. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలోని ప్రధాన కారిడార్ పూర్తిగా వరదతో నిండిపోయింది. చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి సహాయకులు, వైద్య సిబ్బంది మోకాళ్ల వరకూ నిలిచిన నీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అత్యవసర సేవలు పొందేందుకు వచ్చినవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెన్నూర్ పట్టణ సమీపంలోని ఒడ్డెపల్లి కాలనీ సమీపంలోని ఒర్రె వరద ఉధృతంగా ప్రవహించగా రాకపోకలు నిలిచి పోయాయి. భీమారం హైవేపైకి వరద వచ్చి చేరడంతో ఎస్ఐ రాజేందర్ భారీకేడ్లు ఏర్పాటు చేశారు. గొల్లవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. సుద్దాల, రాయిపేట, సంకారం, బుద్దారం, కత్తెరశాల గ్రామాల సమీపంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సోమన్‌పల్లి-దుబ్బపల్లి గ్రామానికి వెళ్లే దారిలో మద్దుల వాగుపై వంతెన నిర్మాణం వద్ద సైడ్ వర్షన్లో రోడ్డు మొత్తం తెగిపోయింది. సుందరశాల, నర్సక్కపేటలోని పాగిపల్లిలో ఇండ్లు కూలిపోయాయి. అన్నారం బ్యారేజ్ వైపు, సమీప గోదావరి ప్రాంతాలవైపు ఎవరూ వెళ్లకూడదని సీఐ బన్సిలాల్ కోరారు.
భీమారంలో నాలాలు లేక పలు ప్రాంతా ల్లో ఇండ్లలోకి వరద వచ్చి చేరుతుందని కొత్తగూడిసెల కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ (ముల్కల్ల)లో జాతీయ రహదారిపై భారీ వృక్షం విరిగి పడటంతో ఎస్ఐ కిరణ్‌కుమార్ సిబ్బందితో కలిసి చెట్టును తొలగించారు. గఢ్‌పూర్ పంచాయతీలోని సల్పల వాగు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. నెన్నెల సమీపంలోని లంబాడీ తండా ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నది. పత్తి చేలల్లో వరద ప్రవహిస్తుంది.

జంగాల్‌పేట నుంచి దమ్మిరెడ్డిపేటకు వెళ్లే దారి మత్తడి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలి చి పోయాయి. కోటపల్లి ప్రాణహిత నది ప్రవాహం పెరుగుతున్నది. మల్లంపేట-నక్కలపల్లి గ్రామాల మధ్యన లోతొర్రె వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మల్లంపేట, నక్కలపల్లి గ్రామాల్లో ఇండ్లు కూలిపోయాయి. వరద ప్రభావిత గ్రామాల్లో కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్ పర్యటించారు. తుంతుంగా చెరువు మత్త డి ప్రవాహంతో ఎదుల్లబంధం రోడ్డు కోతకు గురైం ది. వేమనపల్లి, కల్మలపేట గ్రామాలకు మత్స్యకారులు ప్రాణహిత నది తీరంలో నిలిపివేసిన పడవలు నదిలో కొట్టుకుపోయాయి. 25 పడవలు కొట్టుకుపోతుండటంతో అప్రమత్తమైన మత్యకారులు మర పడవల సాయం తో ఆ పడవలను వెంబడించి పట్టుకొని కోటపల్లి మండలం వెంచపల్లి సమీపంలో ఒడ్డుకు చేర్చారు.
తాండూర్ మండల కేంద్రంలోని రేచిని రోడ్ రైల్వే స్టేషన్ దారిలోని రోడ్ డ్యాం ఉప్పొంగి ప్రవహిస్తుండగా రాకపోకలు నిలిచిపోయాయి. బెజ్జాలకు చెందిన బుచ్చిరావు పెంకుటిల్లు కూలిపోయింది. వేమనపల్లి మండలంలోని కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. నీల్వాయి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరగా, మత్తడి దూకింది. తహసీల్దార్ సాయికృష్ణ వాగు వైపు వెళ్ల వద్దని డప్పు చాటింపు చేయించారు. మామడ గ్రామం మధ్యలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహించగా, తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. ప్రాణహిత నది తీరంలోని ముల్కలపేట, రాచర్ల , కల్లెంపల్లి గ్రామాలను తహసీల్దార్ పరిశీలించారు. జక్కెపల్లి సమీపంలోని రోడ్డుపై వరద ప్రవహించింది. కేతనపల్లిలోని బాపు ఇంటి గోడ కూలి పోయింది.
కన్నెపల్లి మండలం జజ్జరవెల్లి గ్రామంలో వాగు వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తుండగా, భీంపూర్, రెబ్బెన, కన్నెపల్లి, కొత్తపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జజ్జరవెల్లిలో ఇల్లు కూలిపోయింది. రెబ్బెనలో బానయ్యకు చెందిన ఇంటి గోడ కూలిపోయింది. జన్నా రం మండలం తపాలాపూర్‌లో ఇళ్లలోకి వరద చేరింది. కడెం ప్రాజెక్ట్ నుంచి వరదనీరు వస్తున్నందున గోదావరి పరీవాహకప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ బక్కయ్య సూచించారు. దండేపల్లి మండలం కాసిపేటలో రవి, గణపతి పెంకుటిళ్లు కూలిపోయా యి.
గూడెం, కన్ననపేల్లిలో పత్తి నీట మునిగింది. కడెం వద్ద 18 గేట్లు ఎత్తేయడంతో గూడెం గోదావరిలో నీటి మట్టం భారీగా పెరుగుతుంది. కడెం ప్రాజెక్టు మొత్తం గేట్లు ఎత్తేయడంతో గోదారమ్మ పరవళ్లు తొక్కుతుంది. కాసిపేట మండలం పెద్దాపూర్, కోమటిచేను, కాసిపేటలో ఇల్లు కూలిపోయాయి. కొండాపూర్, తాటిగూడ మధ్య వాగు బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మందమర్రి పట్టణంలో రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. ఒకటో జోన్, గ్యాస్ గోదాం సమీపంలో వర్షానికి నానిన రెండు ఇండ్లు కూలి పోయా యి.
మంత్రి వివేక్ వెంకటస్వామి కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, తహసీల్దార్ సతీశ్ కుమార్‌తో కలసి పరిశీలించారు. బెల్లంపల్లిలో ని రాంనగర్ బ్రిడ్జిపై వరద ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితిని సీపీ అంబర్ కిశోర్ ఝా.. మంచిర్యా ల డీసీపీ భాసర్‌తో కలిసి పరిశీలించారు. భీమిని మం డలం చిన్న తిమ్మాపూర్, పెద్ద తిమ్మాపూర్ గ్రామాలు జల దిగ్బంధం అయ్యాయి. రాజారాంలో రమేశ్ ఇల్లు కూలిపోయింది. చెన్నూర్‌లోని పుప్పాల హనుమాన్ వీధితో పాటు పలు కాలనీల్లోకి గాలి కుంట నుంచి చేపలు నీటి ప్రవహానికి ఎదు రీదడంతో కాలనీవాసు లు పట్టుకున్నారు. వీడియో లు తీసి చేపల వర్షం కురిసిందని సోషల్ మీడియా లో పోస్టులు పెట్టడం చర్చనీయాంశమైంది.

ఎల్లంపల్లిలో పెరుగుతున్న నీటిమట్టం
హాజీపూర్, జూలై 30 : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ (గుడిపేట) గ్రామ శివారులోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పొటెత్తున్నది. ప్రాజెక్టు పూర్థి సామర్థ్యం ఎత్తు 148 మీటర్లకుగాను 147.70 ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలు కాగా, 19.3419 టీఎంసీలుగా ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి 156279 క్యూ సెక్కుల వరద వచ్చి చేరుతున్నది. గురువారం 19997 క్యూ సెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. మొత్తం 356254 క్యూ సెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 171650 క్యూ సెక్కులు దిగువకు వదిలి పెడుతున్నారు. హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల కోసం 275 క్యూ సెక్కులను తరలిస్తుండగా, నంది పంపు హౌస్ నుంచి 15750 క్యూ సెక్కుల నీటిని ఎత్తి పోస్తున్నారు. గురువారం రాత్రి 15 గేట్లను ఎత్తి 155625 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా సరాసరిన 121.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లాలోని ఆరు మండలాల్లోని తోతట్టు ప్రాంతాల్లో వాగులు.. వాగులు ఉప్పొంగడంతో 121 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయియి. కుమ్రం భీం ప్రాజెక్టు, గుండి వాగును కలెక్టర్ హరిత గురువారం అధికారులతో కలిసి సందర్శించారు. వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాజూర ఒర్రెను అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
ఆసిఫాబాద్ మండలం తూంపల్లిలోని మొరంవాగు ఉప్పొంగడంతో లో లెవల్ వంతెన మునిగిపోయింది. రాజుర, రెబ్బెనలోని నంబాల వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. కౌటాల-చింతలమానెపల్లి మండలాల సరిహద్దులో గల చింతలపాటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, వంతెనపై నుంచి వరద వెళ్తున్నది. రాకపోకలు నిలిచిపోయాయి. తహసీల్దార్ ప్రమోద్‌కుమార్, ఎస్ఐ సతీశ్ వాగును పరిశీలించి రాకపోకలు నిలిపివేశారు. పోలీసులు బందోబస్తు ఉర్పాటు చేశారు. రెబ్బెన మండలంలో పొంగి ప్రవహిస్తున్న వాగుల వద్దకు వెళ్లి తహశీల్థార్ సూర్యప్రకాశ్, రెబ్బెన ఎస్ఐ వెంకటకృష్ణ ప్రజలను అప్రమత్తం చేశారు. తక్కలపల్లిలో పుప్పాల నాగమ్మ ఇంటి గోడ కూలింది.
బెల్లంపల్లి ఏరియాలోని ఖైర్గూడ ఓసీపీ క్యారీలోకి భారీగా వరద చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. కౌటాల సరిహద్దులోని వార్దా-ప్రాణహిత నదుల్లోకి వరద ఉధృతి పెరుగుతున్నది. తాటినగర్లో విద్యుత్ మరమ్మతులు చేయించారు. దహెగాం మండలంలోని లగ్గాం, దహెగాం, ఐనం, కమ్మర్పల్లి గ్రామాల్లో ఎస్పీ నీతికా పంత్ పర్యటించారు. లగ్గాం వద్ద మద్దోని ఒర్రె,దహెగాం వద్ద మల్లన్న వాగు వరద ఉధృతిని పరిశీలించారు. లోలెవల్ వంతెనల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, దహెగాం ఎస్ఐ చుంచు రమేశ్‌కు సూచించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పీపీ రావు ప్రాజెక్ట్ ప్రధాన ఎడమ కాల్వకు గండి పండింది.
కుమ్రం భీం,వట్టివాగు ఇతర ప్రాజెక్టుల్లో గేట్లు ఎత్తినప్పుడు పెద్దవాగు, ప్రాణహిత నదిలో నీటి మట్టం పెరిగి బ్యాక్ వాటర్‌తో పలు గ్రామాలకు ఇబ్బంది అవుతుందని సీఐ నాగరాజ్ తెలిపారు. మొట్లగూడకు చెందిన ఎనగందుల శంకర్ ఇంటి గోడలు కూలిపోయాయి. బెజ్జూర్ మండలం సోమిని రూట్లో ఉన్న కృష్ణపల్లి, సుష్మీర్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తహసీల్దారు రామ్మోహన్ నేతృత్వంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఏవో నాగరాజు, ఎస్ఐ సర్తాజ్ పాషా కృష్ణపల్లి వాగు వద్ద రాకపోకలను నిషేధించారు.
తలాయి-భీమారం వద్ద బ్యాక్ వాటర్ రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణపల్లి ఒర్రె ఉప్పొంగడంతో 12 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. చింతలమానెపల్లి మండలంలోని దిందా- కేతిని వాగు ఉప్పొంగటంతో రాకపోకలునిలిచిపోయాయి. బాబాసాగర్- నాయకపుగూడా వాగు ఉప్పొంగడంతో నాయకపు వాడకు రాకపోకలు నిలిచిపోయాయి. ఐనం వద్ద లోలెవల్ వంతెన పై నుంచి భారీగా వరద పొంగటంతో దహెగాం-కాగజ్‌నగర్‌కు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జైనూర్‌లో గౌరి-లెండిగూడ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.
తహసీల్దార్ ఆడ బీర్షా, ఎస్ఐ రవికుమార్ సిబ్బందితో కలిసి వాగును పరిశీలించారు. కెరమెరి మండలం లక్మాపూర్, అనార్పల్లి వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సాంఘి గ్రామ వాగులో 200 పశువులు కొట్టుకుపోగా, ఇందులో 150 పశువులు ఒడ్డుకు చేరాయి. మిగతా 50 పశువులు గల్లంతయ్యాయి. తహసీల్దార్ నాగార్జున గౌడ్, ఎంపీడీవో అమ్జద్‌పాషా, ఎస్ఐ శ్రీకాంత్ మండలంలోని ప్రమాదకర వాగులను సందర్శించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. పెంచికల్పేట్ మండలం పెద్దవాగు, ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో వందల ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. బొకివాగు ప్రాజెక్టు నిండుకుండలా మారి మత్తడి దుంకుతున్నది.
కొండపల్లిలోని గొల్లవాగులో ఓ బొలెరో వాహనం చికుకోగా, జేసీబీ సాయంతో బయటకు తీశారు. దర్గపల్లిలో మారిశెట్టి సంతోష్ ఇంటి గోడ కూలిపోవడంతో తహసీల్దార్ రవీందర్ పరిశీలించారు. ఎస్ఐ అనిల్ కుమార్ వాగులు, గొర్రెల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశారు. చింతలమానేపలి మండలం గూడెం అంతర్రాష్ట్ర బ్రిడ్జి వద్ద ప్రాణహిత నది నిండుకుండలా మారింది. దిందా-కేతిని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దిందా గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. శివపల్లి-గూడెం మధ్య ఒర్రె రవీంద్రనగర్-బాలాజీ అనుకోడ మద్య ఈదుల ఒర్రె, బాబాసాగర్-నాయకపు వాడ మధ్య వాగులో వరద నీళ్లు భారీగా చేరడంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

కుమ్రం భీం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
కుమ్రం భీం ప్రాజెక్టులోకి వదర చేరుతుండడంతో అధికారులు 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 10 టీఎంసీలు కాగా, కట్టబలహీనంగా ఉండడంతో అధికారులు 5 టీఎంసీల నీటి నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుత కెపాసిటీ 6.001టీఎంసీల ఉండగా, ఇన్‌ఫ్లో 53333 క్యూసెక్యులు నీరు వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు ఐదు గేట్లను మీటర్ ఎత్తి తెరిచి 10951 క్యూసెక్యుల నీటిని దిగువకు వదులుతున్నారు. వట్టివాగు ప్రాజెక్టులోనికి 26వేల క్యూసెక్యుల నీటి ప్రవాహం వస్తుండంతో నాలుగు గేట్లను తెరిచి 43333 క్యూసెక్యుల నీటిని బయటకు వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
హెల్ప్‌డెస్క్
మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ప్రజలు 08736-293611, టోల్‌ఫ్రీ నంబర్ 18004253611, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ 8309960731, ఇన్చార్జి జవాన్ మేకల నరేశ్ 7386867688 నంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు.